మంచి ప్రణాళిక | water action plan in vishkapatnam | Sakshi
Sakshi News home page

మంచి ప్రణాళిక

Published Mon, Mar 9 2015 10:54 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

water action plan in vishkapatnam

 వాటర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం
 తలకో 135 లీటర్ల రక్షిత నీరు
 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా
 జిల్లాలో 13 గ్రిడ్ల ఏర్పాటుకు సన్నాహాలు
 రూ.4727 కోట్లతో అంచనాలు
 ప్రపంచ బ్యాంకు నిధులిస్తేనే కార్యరూపం


 
 స్మార్ట్‌సిటీగా అవతరించనున్న మహా విశాఖలో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగానే వాటర్ యాక్షన్ ప్లాన్‌లు సిద్ధం చేస్తున్నారు. ఇక ఇదే స్థాయిలో గ్రామీణ జిల్లా వాసుల దాహార్తిని తీర్చేం దుకు ప్రభుత్వం బృహత్తర ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ మెగా ప్రాజెక్టు  రూపకల్పనకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.4727 కోట్ల అంచనాతో రూపొందిం చిన ఈ పథకం పూర్తయితే వచ్చే 50 ఏళ్ల వరకు మంచి నీటికి ఢోకా ఉండదని అధికారులు భావిస్తున్నారు.


 ఒక్కొక్కరికి 40 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయతగ్గ పథకాలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు తగ్గట్టుగా ఒక్కొక్కరికి రోజుకు 135 లీటర్ల చొప్పున నీటిని సరఫరాచేయాలి. ఇదే ప్రమాణాలతో నీటిని సరఫరా చేసేం దుకు వీలుగా జిల్లాలో 13 వాటర్ గ్రిడ్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నదులు,  రిజర్వాయర్లను ఆధునికీకరించడం ద్వారానే కనీసం 25 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించనున్నారు. రానున్న 50 ఏళ్లలో పెరగనున్న జనాభాకనుగుణంగానే మంచినీటి వనరులను పెంచుకునేలా ఈ ప్రణాళికలు రూపకల్పన చేశారు. ఇందుకోసం రూ.4727 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. ఈ మేరకు  వారం రోజుల క్రితం ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇంత పెద్దఎత్తున చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ప్రభుత్వం సమకూర్చే పరిస్థితి లేనందున  హడ్కో లేదా ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో చేపట్టాలనే యోచనలో  ఉన్నట్టు తెలిసింది.

ఇదేరీతిలో రాయలసీమ,  ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వాటర్ గ్రిడ్లు ఏర్పాటు చేయబోతున్నారు. మన జిల్లాలోని 1833 ఆవాస ప్రాంతాల్లో నివసించే 18,21,644 మందికి తగ్గట్టుగా వీటికి రూప కల్పన చేశారు. మొదటి గ్రిడ్ ద్వారా అనకాపల్లి, యలమంచలి, పెందుర్తి నియోజక వర్గాల్లోని నాలుగు మండలాలు అర్బన్ కలిపి 301 ఆవాస ప్రాంతాలకు ఏలేరు, పోలవరం కాలువల నుంచి నీటిని సరఫరా చేస్తారు. రెండో వాటర్ గ్రిడ్ ద్వారా యలమంచిలి నియోజకవర్గంలోని మూడు మండలాలు, అర్బన్‌లోని 151 అవాసాలు, అచ్యుతాపురం ఏపీఐఐసీ సెజ్‌లకు, మూడో గ్రిడ్ ద్వారా భీమిలి, పెందుర్తి నియోజక వర్గాల్లోని ఐదు మండలాల్లో 330 ఆవాసాలకు, నాల్గవ గ్రిడ్ ద్వారా పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 208 ఆవాసాలకు ఏలేరు కాలువ నుంచి నీటిని సరఫరా చేస్తారు. ఐదో గ్రిడ్ ద్వారా మాడుగుల మండలంలో 104 ఆవాసాలకు పెద్దేరు రిజర్వాయర్ నుంచి నీటిని సరఫరా చేస్తారు.

ఆరో గ్రిడ్ ద్వారా చీడికాడ మండలంలో 55 ఆవాసాలకు కోనాం రిజర్వాయర్ నుంచి, ఏడో వాటర్ గ్రిడ్ ద్వారా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని మూడు మండలాలకు చెందిన 199 ఆవాసాలకు రైవాడ రిజర్వాయర్ నుంచి, ఎనిమిదవ గ్రిడ్  ద్వారా చోడవరం నియోజక వర్గం పరిధిలోని మూడు మండలాల్లోని 204 ఆవాస ప్రాంతాలకుకల్యాణపులోవ రిజర్వాయర్ నీటిని అందిస్తారు. తొమ్మిదవ గ్రిడ్‌లో నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలంలో 86 ఆవాస ప్రాంతాలకు తాండవ రిజర్వాయర్ నుంచి, 10వ గ్రిడ్ ద్వారా నర్సీపట్నం మండలంలోని 34 ఆవాస ప్రాంతాలకు, 12వ  గ్రిడ్ ద్వారా మాకవారిపాలెం మండలంలోని 66 ఆవాస ప్రాంతాలకు ఏలేరు కెనాల్ నుంచి నీటిని సరఫరా చేయనున్నారు. మిగిలిన ఆవాస ప్రాంతాలకు 13వ గ్రిడ్ ద్వారా ఏలేరు, పోలవరం కాలువ నుంచి నీటిని సరఫరా చేయనున్నారు. ఈ గ్రిడ్లు పూర్తిగా సోలార్ విద్యుత్‌తో నడిచేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

 
 ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం
 వాటర్ గ్రిడ్ల ఏర్పాటుపై ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇవి కార్యరూపం దాలిస్తే మరో 50 ఏళ్ల వరకు నీటిఎద్దడి సమస్యే ఉండదు. కనీసం ఐదేళ్ల కాల పరిమితిలో వీటిని పూర్తి చేయవచ్చు. రాష్ర్ట వాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఇలాంటి వాటర్ గ్రిడ్ల రూపకల్పనకు ప్రతిపాదనలు ఆర్‌డబ్ల్యూఎస్ తయారు చేసింది. వేల కోట్ల ఖర్చుతో కూడుకున్నందున దశల వారీగా చేపట్టే అవకాశాలున్నాయి.  - తోట ప్రభాకరరావు, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement