కొండాపురం: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పం పాదయాత్ర చేపట్టడంతో అధికార పార్టీ నేతల్లో గుబులు పుట్టుకుంది. పులివెందుల ప్రాంతానికి నీరు ఇచ్చామని చెప్పుకునేందుకు ఆగమేఘాల మీద నీటి తరలింపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సోమవారం సాయంత్రం 500 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన మోటర్ ద్వారా తిమ్మాపురం గ్రామానికి నీటిని మళ్లించే ప్రయత్నం చేశారు. అయితే తమ చెరువుకు ఇప్పుడే గండ్లు పడి కట్ట తెగిపోయే స్థితిలో ఉంది. పొర్ల కట్ట నిర్మించకుండా తిమ్మాపురం చెరువులో నీటిని నింపితే చెరువు తెగి తమ గ్రామంలోకి నీరు వస్తుందని.. ఎట్టి పరిస్థితిలోనూ తమ చెరువును పూర్తి స్థాయిలో నిర్మించిన తర్వాతనే నీటిని తరలించాలని తిమ్మాపురం గ్రామస్తులు మంగళవారం అడ్డుకున్నారు.
వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటంతో పులివెందులకు సీబీఆర్ ద్వారా నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. గాలేరు– నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన గండికోట జలాశయం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీళ్లు తీసుకెళుతుండగా మంగళవారం తిమ్మాపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. చెరువుకు పొర్లకట్ట నిర్మించాకే నీళ్లు తీసుకెళ్లాలని మోటర్లను బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. గండికోట ఎత్తిపోతల పథకం వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. సంఘటన స్థలానికి కొండాపురం ఎస్‌ఐ శివప్రాసాద్ రెడ్డి చేరుకొని ప్రజలతో చర్చించారు.
గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ ఈఈ రవీందర్‌రెడ్డి గ్రామస్తులతో మాట్లాడి ఇక్కడ ఉన్న పరిస్థితిని ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీళ్లు తీసుకెళ్లాలంటే గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ స్టేజి–1 నుంచి తిమ్మాపురం చెరువులో నీళ్లు నింపి అందులో నుంచి పాలూరు వద్ద జీకెఎల్‌ఐ–2కు తరలించాలి. అక్కడి నుంచి అనంతపురం జిల్లాలోని ఎల్లనూరు చెరువుకు నీళ్లు తరలించి, దీని నుంచి మళ్లీ జీకెఎల్‌ఐ–3 నుంచి గడ్డంవారిపల్లె చెరువులోకి, ఆ తరువాత జీకెఎల్‌ఐ–4 నుంచి గొడ్డుమర్రి చెరువులోకి పంపాల్సి ఉంది. మళ్లీ ఇక్కడ నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి తీసుకెళ్లాలి.
అయితే మొదటి దశలోనే తిమ్మాపురం చెరువు పూర్తిగా నిర్మించకుండా పులివెందులకు నీళ్లు తీసుకెళితే ఏ క్షణమైనా మొరకట్ట తెగి గ్రామంలోకి వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరి పొర్లకట్ట వద్ద పొర్లడంతో మొరకట్ట తెగి గ్రామంలోకి నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో అప్పట్లో అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయాలని దండోరా వేయించారని గ్రామస్తులు తెలిపారు. ఇదంతా తెలిసి తిరిగి చెరువులో నీళ్లు ఎలా నింపుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పొర్లకట్ట నిర్మించి నీళ్లు తీసుకెళ్లండి
తిమ్మాపురం చెరువుకు పొర్లకట్ట నిర్మించి ఎక్కడికైనా నీళ్లు తీసుకెళ్లండి.. తమకేమీ అభ్యంతరం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. తిమ్మాపురం చెరువు కట్ట నిర్మాణాన్ని మెగా కన్‌స్ట్రక్షన్ కంపెనీ టెండర్ ద్వారా దక్కించుకుంది. ఏళ్లు గడుస్తున్నా పొర్లకట్ట నిర్మాణం చేపట్టలేదంటున్నారు. ఈ విషయంపై ఈఈ రవీందర్‌రెడ్డిని వివరణ కోరగా చెరువుకట్ట నిర్మాణంలో భాగంగా పొర్లకట్ట నిర్మాణంలో ఆలస్యమైందన్నారు.
పొర్లకట్ట లేకపోవడం వల్ల ప్రమాదం
మా గ్రామంలో 1273 మంది జనాభా ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిమ్మాపురం చెరువు( సామర్థ్యం 0. 30 టీఎంసీలు)లోకి వరదనీరు వచ్చి చేరడంతో చెరువుకు గండ్లు పడ్డాయి. అప్పట్లో అధికారులు చెరువు నుంచి నీళ్లు తరలించడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం జికెఎల్‌ఐ–1 నుంచి చెరువులోకి రోజుకు 500 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. చెరువులో నీళ్లు నింపితే పొర్లకట్ట లేకపోవడంతో ప్రమాదం వాటిల్లుతుంది.
–వై. రామంజనేయులు
ఆందోళన చేస్తాం
తిమ్మాపురం చెరువులోకి నీళ్లు వదిలితే ఆందోళన చేపడుతాం. పొర్లకట్ట నిర్మించుకొని చెరువులోకి నీళ్లను నింపుకుంటే మా కెలాంటి అభ్యంతరం లేదు. చెరువులోకి నీళ్లు నింపితే మొరకట్ట తెగి మా గ్రామంలోకి నీళ్లు వస్తాయి. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలి
–హుసేనయ్య, తిమ్మాపురం గ్రామం
Comments
Please login to add a commentAdd a comment