వైభవం.. ఆదిదంపతుల జలవిహారం
హంసవాహనంపై ఆదిదంపతుల కృష్ణానదీ విహారం
ఇంద్రకీలాద్రి : ఆదిదంపతులైన శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్లకు హంస వాహనసేవ కనుల పండువగా జరిగింది. హంసవాహనంపై ఆశీనులైన ఆదిదంపతులు కృష్ణానదిపై నుంచి వచ్చే చల్లటి గాలులను ఆస్వాదిస్తూ విహరించారు. హంస వాహనంపై ఆశీనులైన ఆదిదంపతులకు ఆలయ ఈవో నర్సింగరావు దంపతులు పూజాకార్యక్రమాలను నిర్వహించారు. తెప్పోత్సవంగా పిలిచే హంసవాహన సేవలో త్రిలోక సంచారానికి గుర్తుగా గంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వరస్వామివార్లు మూడు ప్రదక్షణలు జల విహారం చేశారు. విద్యుత్ దీపకాంతులతో దైదీప్యమానంగా వెలిగిపోతున్న హంసవాహనంపై నదీవిహారం చేస్తున్న దుర్గామల్లేశ్వరస్వామివార్లను తిలకించేందుకు అశేష భక్తజనం దుర్గాఘాట్‌కు తరలివచ్చారు. జై.. భవానీ.. జై జై భవానీ నామస్మరణతో దుర్గాఘాట్ మార్మోగింది.
దసరా ఉత్సవాల్లో 9 రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన దుర్గమ్మ పదో రోజు గురువారం శ్రీరాజరాజేశ్వరిదేవియై శాంతిమూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయం నుంచి అమ్మవార్లతో పాటు అయ్యవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకువచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, బేతాళ నృత్యాలు, కోలాటాలు.. కళాకారులు విన్యాసాలతో అమ్మవారి ఊరేగింపు కనుల పండవగా సాగింది. తెప్పోత్సవాన్ని జిల్లా కలెక్టర్ బాబు.ఏ, నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, పలువురు పోలీసు అధికారులు, దేవస్థాన ఈఈ కోటేశ్వరరావుతోపాటు ఆలయ అర్చకులు తిలకించారు. నదీ విహారం అనంతరం ఉత్సవమూర్తులను బ్రాహ్మణవీధిలోని జమ్మిచెట్టు వద్ద వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ హౌస్ అఫీసర్ వెంకటేశ్వర్లు దంపతులచే శమీపూజ, పారువేట ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది.