సాక్షి, చిత్తూరు : వాటర్‌షెడ్ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను నిలిపివేసింది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వాటా పెంచేంతవరకు నిధులు ఇచ్చేది లేదంటూ తేల్చిచెప్పింది. రాష్ట్రం ఎటూ తేల్చక పోవడంతో గత ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటివరకు జిల్లాకు ఇవ్వాల్సిన రూ.2.49 కోట్ల నిధులను నిలిపివేసింది. దీంతో జిల్లాలో వాటర్‌షెడ్ అభివృద్ధి పనులు ముందుకు సాగే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో వాటర్‌షెడ్ పథకం కింద 2009 -10 నుంచి 5 నుంచి 7 ఏళ్ల కాలపరిమితితో పనులుచేపట్టారు.
2009-10లో తొమ్మిది మండలాల పరిధిలో 9 ప్రాజెక్టుల కింద 55 వాటర్‌షెడ్లలో 38.25 వేల హెక్టార్లలో అభివృద్ధి పనులను చేపట్టాల్సి ఉంది. 2010-11లో 14 మండలాల పరిధిలో 18 ప్రాజెక్టుల కింద 115 వాటర్‌షెడ్లలో 77.13 వేల హెక్టార్ల పరిధిలో, 2011-12లో 10 మండలాల పరిధిలో 20 ప్రాజెక్టుల కింద 105 వాటర్‌షెడ్లలో 82.68 వేల హెక్టార్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. వీటిలో 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదు.
ఇక 2012-13 లో రెండు మండలాల పరిధిలో 11 ప్రాజెక్టుల కింద 60 వాటర్‌షెడ్ల పరిధిలో 43.83 వేల హెక్టార్లలో, 2014-15 లో ఒక్క మండల పరిధిలో నాలుగు ప్రాజెక్టుల కింద 24 వాటర్‌షెడ్ల పరిధిలో 16వేల హెక్టార్లలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే పై రెండు సంవత్సరాలకు సంబంధించి పనుల్లో పురోగతి లేకుండా పోయింది. కేంద్రం సైతం మొక్కుబడిగా నిధులు ఇవ్వడంతో వాటర్‌షెడ్ల పనులు జరగడం లేదు. మొత్తంగా ఆరేళ్ల కాలపరిమితిలో 36 మండలాల పరిధిలో 62 ప్రాజెక్టుల కింద 359 వాటర్‌షెడ్ల పరిధిలో 2.54లక్షల హెక్టార్లలో వాటర్‌షెడ్ అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది.
ఇందుకోసం రూ.305.59 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.136 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2014-15కు సంబంధించి పనులు ప్రతిపాదనలకే పరిమితయ్యాయి. ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. 2012-13కు సంబంధించి కూడా మొక్కుబడి పనులతో సరిపెట్టారు. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు కేంద్రం ఇవ్వాల్సిన 90 శాతం వాటా రూ.2.49 కోట్ల నిధులను నిలిపివేయడంతో పనులు దాదాపు నిలిచిపోయాయి.
ఇప్పటివరకు వాటర్‌షెడ్లకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం 90శాతం నిధులు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటాగా ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాను 20 నుంచి 25 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎటూ తేల్చలేదు.
వాటా వస్తే ఒట్టు !
Published Sun, Oct 11 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM
Advertisement
Advertisement