అండగా మేముంటాం: ప్రధాని
న్యూఢిల్లీ: పెను తుపాన్‌తో కకావికళమైన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ భరోసా ఇచ్చారు. తుపాన్ బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఆదివారం ఆయన సీఎం చంద్రబాబుకు ఆదివారం ఫోన్ చేసి వాకబు చేశారు. తుపాన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించి వివరిస్తుండగా ప్రధాని ఫోన్ చేశారు. ప్రధాని మోదీ లైన్‌లో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు కంభంపాటి రామ్మోహనరావు సీఎంకు సెల్‌ఫోన్ అందించారు. కేంద్రం అందించిన సహాయానికి మోదీకి ఈ సందర్భంగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. కోస్తా తీరాన్ని తుపాన్ అతలాకుతలం చేసిన తీరును ప్రధానికి సీఎం వివరించారు.
‘సార్.. రాడార్లతో సంబంధాలు తెగిపోయాయి. నష్టాన్ని ఇంకా అంచనా వేస్తున్నాం’ అని ఫోన్‌లో ప్రధానితో చంద్రబాబు పేర్కొన్నారు. ఒకవైపు మీడియా సమావేశం కొనసాగుతుండగానే ప్రధానితో ఆయన సంభాషించారు. తుపాన్ నష్టాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను మోదీ అభినందించారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు విశాఖ వెళ్లనున్నట్లు ప్రధానికి చంద్రబాబు తెలిపారు. పెనుగాలులు, భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు సీఎం చెప్పారు. రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఇళ్లలోనే ఉండాలని కోరటం ద్వారా ప్రజల విలువైన ప్రాణాలను కాపాడగలిగామన్నారు. పంటలు, భవనాలు, వంతెనలకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు.
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు
విశాఖపట్నం: హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శించటంతోపాటు నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్టణం వ స్తున్నారు. సీఎం విజయవాడ వరకు విమానంలో చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విశాఖ వస్తారని జిల్లా యంత్రాంగం ప్రకటించింది.