Kambampati Ramohan rao
-
బంజారాహిల్స్‌లో టీడీపీ ఎంపీపై కేసు
హైదరాబాద్: కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ), జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నివాస ప్రాంతాల్లో కార్ల సర్వీస్ సెంటర్ నిర్వహిస్తూ స్థానికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీ, శ్రీజయలక్ష్మి ఆటోమోటివ్స్ ఎండీ కంభంపాటి రామ్మోహన్‌రావుపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అక్రమ పార్కింగ్లు, అక్రమ డీజిల్ నిల్వలతో కంభంపాటి రామ్మోహన్రావు తమకు న్యూసెన్స్‌ను కలిగిస్తున్నారంటూ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని తోటంబంజారా అపార్ట్మెంట్ వాసులతో పాటుగా స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఐపీసీ సెక్షన్ 278, 336 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐస్ ఫ్రూట్ ఫ్యాక్టరీ పేరుతో అనుమతులు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని భాగ్యనగర్ స్టూడియోస్ ఆవరణలో రామ్మోహన్రావు ఐస్‌ఫ్రూట్ ఫ్యాక్టరీ అండ్ మిషిన్ పేరుతో జీహెచ్ఎంసీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకుని లక్ష్మీ హుందయ్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కార్ షెడ్, వర్క్‌షాప్, సర్వీస్ సెంటర్‌ను నడిపిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్లకు డెంటింగ్, పెయింటింగ్‌తో పాటు ఇతర మిషనరీ పనులు చేస్తుండటంతో వాయు, శబ్ద కాలుష్యంతో తామంతా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వృద్ధులు బ్రాంకైటిస్, ఆస్తమా వ్యాధులకు గురవుతున్నారన్నారు. ఇక్కడ ఖాళీ స్థలాన్ని వినియోగించుకుంటూ రోడ్డు పక్కన అక్రమ పార్కింగ్లు కూడా చేస్తున్నారని తెలిపారు. ఇక్కడే డీఏవీ స్కూల్ కూడా ఉందని, తరచూ కార్ల రాకపోకలు, అక్రమ పార్కింగ్‌లతో విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సర్వీస్ సెంటర్ నిర్వహణకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఉండాలని, ఈ మేరకు పీసీబీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఐస్‌ఫ్రూట్ ఫ్యాక్టరీ పేరుతో ట్రేడ్ లైసెన్స్ మాత్రమే కలిగి ఉన్న ఆయన కారు షెడ్, సర్వీస్ సెంటర్‌కు మాత్రం ఎలాంటి పన్నులు చెల్లించడం లేదని, దీనివల్ల ప్రభుత్వం ఖజానాకు భారీగా నష్టం వస్తోందన్నారు. ఇక్కడి గోడౌన్లో 40 వరకు ఇంజిన్ ఆయిల్ డ్రమ్ములు నిల్వ చేయడంతో పాటుగా పెద్ద ఎత్తున సామగ్రి నింపారని, దీనివల్ల నివాసిత ప్రాంతంలో ప్రశాంతత కరువైందన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రొఫెసర్ల విడుదలపై అయోమయం
* విడుదలయ్యారని వెల్లడించిన ఏపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి * టీవీ చానళ్లలో వార్తలు చూసి స్వీట్లు పంచుకున్న కుటుంబ సభ్యులు * రాత్రి పొద్దుపోయే వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయని కేంద్రం * ప్రొఫెసర్లు విడుదలయ్యారో? లేదో? తెలియక బంధువుల్లో ఆందోళన హైదరాబాద్: లిబియా దేశంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, బలరాం కిషన్ విడుదలపై అయోమయం నెలకొంది. ఉగ్రవాదుల చెర నుంచి ప్రొఫెసర్లు విడుదలయ్యారని బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు మీడియాకు చెప్పటంతో ఆ వార్తలను టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. టీవీల్లో వచ్చిన వార్తల ఆధారంగా తమ వారు విడుదలయ్యారని ప్రొఫెసర్ల కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకొని స్వీట్లు కూడా పంచుకున్నారు. తమ వారి విడుదల కోసం కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆయా పార్టీల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ అంశంపై రాత్రి పొద్దుపోయే వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటనా వెలువడక పోవ డంతో ప్రొఫెసర్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అసలు తమ వారు విడుదలయ్యారో? లేదో? తెలియక వారు మనో వ్యథకు గురయ్యారు. లిబియాలోని ఓ వర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న గోపీకృష్ణ, బలరాం కిషన్‌లను వారం క్రితం ఉగ్రవాదులు బంధించిన సంగతి తెలిసిందే. ప్రొఫెసర్లు విడుదలైనట్లు కేంద్రం నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంపై సస్పెన్స్ నెలకొంది. ఒకవేళ బందీలు విడుదల అయినా లిబియా సరిహద్దులు దాటే వరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేయకూడదన్న నిర్ణయానికి వచ్చి ఉండొచ్చనే అంశంపై చర్చ సాగుతోంది. అందరికీ కృతజ్ఞతలు: ప్రొఫెసర్లు విడుదలయ్యారన్న వార్తలు టీవీలో చూసిన బలరాం కిషన్ భార్య శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘వారం రోజు లుగా నరకాన్ని అనుభవించాం. ఆయన క్షేమంగా విడుదలయ్యారన్న వార్త సంతో షాన్ని కలిగించింది. ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు లిబియా వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది ఎంతో కృషి చేశారు’’ అని చెప్పారు. ఆనందంగా ఉంది: గోపీకృష్ణ కుటుంబ సభ్యులు ప్రొఫెసర్లు ఉగ్రవాదుల చెర నుంచి విడుదల అయ్యారన్న సమాచారం తెలుసుకున్న గోపీకృష్ణ కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరి సింది. గోపీకృష్ణ విడుదలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణ మాత్రం తమకు రాత్రి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని, టీవీ చానళ్లలోనే విడుదలైనట్లు చూశామని చెప్పారు. -
అండగా మేముంటాం: ప్రధాని
న్యూఢిల్లీ: పెను తుపాన్‌తో కకావికళమైన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ భరోసా ఇచ్చారు. తుపాన్ బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఆదివారం ఆయన సీఎం చంద్రబాబుకు ఆదివారం ఫోన్ చేసి వాకబు చేశారు. తుపాన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించి వివరిస్తుండగా ప్రధాని ఫోన్ చేశారు. ప్రధాని మోదీ లైన్లో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు కంభంపాటి రామ్మోహనరావు సీఎంకు సెల్‌ఫోన్ అందించారు. కేంద్రం అందించిన సహాయానికి మోదీకి ఈ సందర్భంగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. కోస్తా తీరాన్ని తుపాన్ అతలాకుతలం చేసిన తీరును ప్రధానికి సీఎం వివరించారు. ‘సార్.. రాడార్లతో సంబంధాలు తెగిపోయాయి. నష్టాన్ని ఇంకా అంచనా వేస్తున్నాం’ అని ఫోన్లో ప్రధానితో చంద్రబాబు పేర్కొన్నారు. ఒకవైపు మీడియా సమావేశం కొనసాగుతుండగానే ప్రధానితో ఆయన సంభాషించారు. తుపాన్ నష్టాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను మోదీ అభినందించారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు విశాఖ వెళ్లనున్నట్లు ప్రధానికి చంద్రబాబు తెలిపారు. పెనుగాలులు, భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు సీఎం చెప్పారు. రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఇళ్లలోనే ఉండాలని కోరటం ద్వారా ప్రజల విలువైన ప్రాణాలను కాపాడగలిగామన్నారు. పంటలు, భవనాలు, వంతెనలకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. నేడు విశాఖకు సీఎం చంద్రబాబు విశాఖపట్నం: హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శించటంతోపాటు నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్టణం వ స్తున్నారు. సీఎం విజయవాడ వరకు విమానంలో చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విశాఖ వస్తారని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. -
ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్‌రావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనకు కేబినెట్ మంత్రి హోదా కల్పించినట్టు పేర్కొంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.