బలరాం కిషన్ విడుదల గురించి ఫోన్ లో మాట్లాడుతున్న ఆయన భార్య శ్రీదేవి
* విడుదలయ్యారని వెల్లడించిన ఏపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి
* టీవీ చానళ్లలో వార్తలు చూసి స్వీట్లు పంచుకున్న కుటుంబ సభ్యులు
* రాత్రి పొద్దుపోయే వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయని కేంద్రం
* ప్రొఫెసర్లు విడుదలయ్యారో? లేదో? తెలియక బంధువుల్లో ఆందోళన
హైదరాబాద్: లిబియా దేశంలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, బలరాం కిషన్ విడుదలపై అయోమయం నెలకొంది. ఉగ్రవాదుల చెర నుంచి ప్రొఫెసర్లు విడుదలయ్యారని బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు మీడియాకు చెప్పటంతో ఆ వార్తలను టీవీ చానళ్లు ప్రసారం చేశాయి.
టీవీల్లో వచ్చిన వార్తల ఆధారంగా తమ వారు విడుదలయ్యారని ప్రొఫెసర్ల కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకొని స్వీట్లు కూడా పంచుకున్నారు. తమ వారి విడుదల కోసం కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆయా పార్టీల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ అంశంపై రాత్రి పొద్దుపోయే వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటనా వెలువడక పోవ డంతో ప్రొఫెసర్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అసలు తమ వారు విడుదలయ్యారో? లేదో? తెలియక వారు మనో వ్యథకు గురయ్యారు. లిబియాలోని ఓ వర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న గోపీకృష్ణ, బలరాం కిషన్‌లను వారం క్రితం ఉగ్రవాదులు బంధించిన సంగతి తెలిసిందే. ప్రొఫెసర్లు విడుదలైనట్లు కేంద్రం నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంపై సస్పెన్స్ నెలకొంది. ఒకవేళ బందీలు విడుదల అయినా లిబియా సరిహద్దులు దాటే వరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేయకూడదన్న నిర్ణయానికి వచ్చి ఉండొచ్చనే అంశంపై చర్చ సాగుతోంది.
అందరికీ కృతజ్ఞతలు: ప్రొఫెసర్లు విడుదలయ్యారన్న వార్తలు టీవీలో చూసిన బలరాం కిషన్ భార్య శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘వారం రోజు లుగా నరకాన్ని అనుభవించాం. ఆయన క్షేమంగా విడుదలయ్యారన్న వార్త సంతో షాన్ని కలిగించింది. ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు లిబియా వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది ఎంతో కృషి చేశారు’’ అని చెప్పారు.
ఆనందంగా ఉంది: గోపీకృష్ణ కుటుంబ సభ్యులు
ప్రొఫెసర్లు ఉగ్రవాదుల చెర నుంచి విడుదల అయ్యారన్న సమాచారం తెలుసుకున్న గోపీకృష్ణ కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరి సింది. గోపీకృష్ణ విడుదలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణ మాత్రం తమకు రాత్రి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని, టీవీ చానళ్లలోనే విడుదలైనట్లు చూశామని చెప్పారు.