
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): రాష్ట్ర రాజధానికి, పోలవరానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అడ్డుకాదని, ఈ రెండింటి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసే అవినీతికి మాత్రమే అడ్డు అని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రభుత్వం భూసేకరణ నోటీసును ప్రకటించటంపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆర్కే రైతులతో సమావేశమయ్యారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు రాజధానికి, పోలవరానికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమంటూ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం రాజధాని ప్రాంతానికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూములిచ్చిన రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, రాజధాని నిర్మాణం ఇక్కడే జరుగుతుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే సమయానికి ప్రభుత్వం బలవంతంగా లాక్కున్న భూములను వెనక్కివ్వడానికి సైతం వెనుకాడబోమని వైఎస్ జగన్ తెలిపారని వివరించారు.
పోలవరం ప్రతిపాదనలు చేసిందే వైఎస్సార్
పోలవరం ప్రాజెక్టుకు అసలు ప్రతిపాదనలను చేసిందే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని, దాన్ని వైఎస్ జగన్ ఎలా అడ్డుకుంటారని ఆర్కే ప్రశ్నించారు. రాజధాని, పోలవరం పేర్లతో కోట్ల రూపాయిలు దండుకుంటున్న చంద్రబాబు అక్రమ సంపాదనకే వైఎస్సార్‌సీపీ అడ్డు అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజధానిని నిర్మిస్తానంటే ప్రపంచ బ్యాంకు వద్దకు ఎందుకు అప్పు కోసం వెళ్తున్నారని ఆయన నిలదీశారు. పోలవరంలో అవినీతి జరుగుతోందని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. వాటికి సమాధానం చెప్పకుండా వైఎస్సార్‌సీపీని విమర్శించడమేంటని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment