
58 శాతం మేము భరిస్తాం:చంద్రబాబునాయుడు
ఫీజు రీరుుంబర్స్‌మెంట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీకి తానే బ్రాండ్ అంబాసిడర్‌నని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థుల మొత్తం ఫీజులో తమ ప్రభుత్వం 58 శాతం ఫీజును రీయింబర్స్ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం అన్నింటినీ జనాభా ప్రాతిపదికన విభజించిందని, ఆ ప్రకారమే తాము 58 శాతం ఫీజును రీయింబర్స్ చేస్తామని పేర్కొన్నారు. మిగిలిన 42 శాతం ఫీజులను తెలంగాణ ప్రభుత్వం భరించాలని అన్నారు. ఈ ప్రకారం చేస్తే ఏపీ ఖజానాపై రూ.4 వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు.
మానవ వనరుల అభివృద్ధిపై చంద్రబాబు గురువారం తన నివాసంలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్, స్థానికత.. ప్రతి అంశాన్నీ వివాదం చేయటం సరికాదు. వీటిపై తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా. త్వరలో సీఎంకు లేఖ రాస్తా. స్థానికత నిర్ధారించేందుకు చట్టాలున్నాయి. 1956కు ముందు తెలంగాణలో ఉన్న వారే స్థానికులనటం సరికాదు. 10ఏళ్లు విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు జరపాలని విభజన చట్టంలో ఉంది. దాన్ని.. అమలు చేయాలి.. ఏపీకి ప్రత్యేకంగా బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎవరు లేరు. నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను’ అని వ్యాఖ్యానించారు.