ముందుచూపుతో ప్రాణ నష్టాన్ని తగ్గించాం
విశాఖ : హుదూద్ తుఫానుపై ముందుచూపుతో వ్యవహరించటం వల్లే ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తుఫాను దెబ్బకు అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు బుధవారం ఉదయం విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ పునరుద్ధరణ తమ ప్రధాన కర్తవ్యమన్నారు. తొమ్మిది లక్షల కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలు అందిస్తున్నట్లు చెప్పారు.
నిన్నటి పరిస్థితితో పోల్చుకుంటే ఇవాళ పరిస్థితి మెరుగుపడిందన్నారు. నష్టనివారణపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై బ్లూప్రింట్ తీసి అన్ని రాష్ట్రాలకు పంపుతామని చంద్రబాబు తెలిపారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రానికి కేంద్ర బృందం రానున్నట్లు చెప్పారు. విశాఖ ఏజెన్సీ, గ్రామాల్లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని, ఇక గ్రామాలపై దృష్టి పెడతామని ఆయన తెలిపారు.