సమ్మె విరమించం
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు, మంత్రివర్గ ఉపసంఘం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించబోమని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. ఆదివారం సచివాలయంలో జరిగిన చర్చలకు ఉపసంఘం సభ్యులైన మంత్రులు రామనారాయణరెడ్డి, కొండ్రు మురళి హాజరయ్యారు.
ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నేత దామోదరరావు, నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ) నాయకుడు ప్రసాద్, మున్సిపల్ ఉద్యోగులజేఏసీ నేత కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్ వీఆర్వోల సమాఖ్య చైర్మన్ భక్తవత్సలనాయుడు, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ, నాయకులు మురళీమోహన్, కృష్ణయ్య, ప్రభుత్వ గురుకులాల సమైక్య పోరాట సమితి కన్వీనర్ సుధాకర్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు బాబూరావు, సమైక్యాంధ్ర ఉపాధ్యాయుల పోరాట సమితి కన్వీనర్ కమలాకరరావు, ట్రెజరీ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్, గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడు మణికుమార్, సహకార ఉద్యోగుల సంఘం నేత ఫణికుమార్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. రేషన్ సరుకుల పంపిణీ, ఆరోగ్య సేవలు, ప్రజా రవాణా స్తంభించాయని, విద్యా సంస్థలు మూతపడ్డాయని, పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా సమ్మె విరమించి పాలనలో భాగస్వాములు కావాలని ఉద్యోగులకు మంత్రివర్గ ఉపసంఘం విజ్ఞప్తి చేసింది.
అన్ని ఉద్యోగ సంఘాల ఏకైక డిమాండ్.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమేనని, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పలు శాఖల్లో ఎస్మా ప్రయోగించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. ‘‘ఎస్మా పెట్టడం పాలనలో సాధారణమైన అంశం. దానికి ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఎస్మా జీవోలు ఇచ్చినంత మాత్రాన అమలు చేసినట్లు కాదు. అమలు నిర్ణయం ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవాల్సింది. ఉద్యోగులపై కక్షసాధింపునకు ఎస్మాను వాడుకొనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఆందోళన వద్దు’’ అని మంత్రులు వివరించారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర విభజన వల్ల ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను సంఘాల వారీగా ఉపసంఘం ముందుంచారు. జోనల్ వ్యవస్థ కనుమరుగైతే ఉద్యోగుల సీనియారిటీ దెబ్బతింటుందని, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వెళ్లిపోవాల్సి ఉంటుందని, పెన్షన్ చెల్లింపుల్లో సమస్యలు తలెత్తుతాయని, లక్షలాది మంది పెన్షనర్ల కుటుంబాలకు స్థాన చలనం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఏపీఎన్జీవోలు చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లలో ఉద్యోగులకు రాష్ట ప్రభుత్వం నుంచి 010 పద్దు కింద జీతాలు చెల్లించాలనే డిమాండ్‌ను మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ప్రస్తావించింది. సమైక్య రాష్ట్రంలోనే రూ.50- 60 కోట్ల మేర జీతాలు చెల్లించడానికే ప్రభుత్వం వెనకాముందూ ఆలోచిస్తుంటే, విభజన తర్వాత పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేసింది. అత్యవసర సేవలు కొనసాగిస్తున్నందున ఎస్మా ప్రయోగించడాన్ని తప్పుబట్టింది.
రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో ఆర్టీసీని మూసివేయాల్సిందేనని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈయూ, ఎన్‌ఎంయూ ఆందోళన వ్యక్తం చేశాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీసం చేసి ప్రజా రవాణాను ఒక విభాగంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, గురుకుల పాఠశాలలు, సచివాలయ, రెవెన్యూ, ట్రెజరీ, సహకార ఉద్యోగులు, డిప్యూటీ కలెక్టర్లు కూడా తమ సమస్యలను ఉపసంఘం ముందుంచారు. శాఖల వారీగా ‘విభజన’ సమస్యలను ఆయా శాఖాధిపతులకు నివేదిక రూపంలో సమర్పించాలని, ఒక కాపీని ఉపసంఘానికి ఇవ్వాలని మంత్రులు సూచించారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో చర్చలకు విఘాతం: ఆనం
సీమాంధ్రలో పాలన స్తంభించిపోయిందని, పేదలకు నిత్యావసరాలు మొదలు పథకాల ప్రయోజనాలేమీ అందక ఇబ్బంది పడుతున్నందున సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేసినట్లు చర్చల అనంతరం మంత్రి ఆనం వెల్లడించారు. అర్థవంతమైన ముగింపు వచ్చే వరకు చర్చలు కొనసాగుతాయని ప్రకటించారు. సీమాంధ్రలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వల్ల చర్చలకు విఘాతం కలుగుతుందని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. విభజన సమస్యలపై ఉద్యోగ సంఘాలు సమర్పించే నివేదికలను తాము అధ్యయనం చేయడంతో పాటు కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు. జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మినహా.. అదనపు జేసీల నుంచి అటెండర్ల వరకు ఉద్యోగులంతా సమ్మెలో ఉన్నారని పేర్కొన్నారు.