- డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని తీర్మానం
- ఐకేపీ అధికారిని చుట్టు ముట్టిన మహిళలు
- సర్పంచ్ జోక్యంతో శాంతించిన మహిళలు
రామచంద్రాపురం: వాయిదాల రుణమాఫీ మాకొద్దు,డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలంటూ మండలంలోని అనుపల్లి గ్రామసమాఖ్య మహిళలు గురువారం జరిగిన గ్రామసమాఖ్యలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు ఇచ్చే రూ.10 వేలను కూడా వాయిదా పద్ధతిలో ఇవ్వడాన్ని మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. మొదటి విడత విడుదల చేసే రూ.3 వేలను కూడా సంఘంలోని రీవాల్వింగ్ ఫండ్‌గా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందుగా డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, గద్దెనెక్కిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవడం దారుణమన్నారు.
గ్రామసమాఖ్య సమావేశానికి హాజరైన ఐకేపీ సీసీ జేకే రెడ్డిని మహిళలు చుట్టుముట్టారు. దీంతో స్థానిక సర్పంచ్ యద్దల చంద్రశేఖర్‌రెడ్డి జోక్యం చేసుకుని మహిళలకు సర్థి చెప్పారు. దీంతో మహిళలు శాంతించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్ర భుత్వం మహిళలను ఆర్థిక సంక్షోభం లో కి నెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయే లా చేసిందని ఆరోపించారు. సీఎం మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గ్రామసమాఖ్య అధ్యక్షురాలు కృష్ణమ్మ, సంఘమిత్ర సుబ్బరత్న, మహిళలు తదితరులు పాల్గొన్నారు.