సమైక్యవాదాన్నే వినిపించాం: కావూరి
ఏలూరు : జీవోఎం ముందు సమైక్యవాదాన్నే వినిపించామని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పాస్ చేస్తే తామేమీ చేయలేమని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అధిష్టానంతోనే పోరాడతామని కావూరి తెలిపారు. అయితే మద్దతు కోసం ఇతర పార్టీ నేతలను కలిసే ఆలోచన లేదని ఆయన అన్నారు.
కాగా రాష్ట్ర విభజనపై సీమాంధ్ర కేంద్ర మంత్రులు నిన్న జీవోఎం సభ్యులకు నివేదికను అందజేశారు. కేంద్ర మంత్రులంతా తమ అభిప్రాయాలను జీవోఎంకు చెప్పారు. ఒక్కొక్కరు 10 నిమిషాలకుపైగానే మాట్లాడారు. అయితే అందరూ స్థూలంగా విభజనకు అంగీకరిస్తూనే తద్వారా తలెత్తే సమస్యలను పరిష్కరించాలంటూ కోర్కెల చిట్టా విప్పారు. కిశోర్ చంద్రదేవ్ మినహా మిగిలిన వారంతా హెచ్‌ఎండీఏ పరిధిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరారు.