
డీఎస్పీ సుప్రజపై క్రమశిక్షణా చర్యలు పరిశీలిస్తున్నాం:డీజీపీ
హైదరాబాద్: గుంతకల్ డీఎస్పీ సుప్రజపై క్రమశిక్షణా చర్యల అంశాన్ని పరిశీలిస్తున్నామని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. ఆమెను ప్రస్తుతం గ్రేహౌండ్స్కు బదిలీ చేశామన్నారు. సుప్రజపై విచారణ చేసి నివేదిక అందించాలని రాయలసీమ ఐజీని ఆదేశించామని ప్రసాదరావు తెలిపారు. ఓ హత్య కేసుకు సంబంధించి ఆదివారం నిందితులకు నడిరోడ్డుపైనే కౌన్సిలింగ్ ఇచ్చిన సుప్రజ మరింత దూకుడుగా వ్యవహరించారు. నిందితులను పట్టుకుని ఊర్లో ఊరేగించడంతోపాటు బహిరంగంగా రోడ్డుపైనే లాఠీలతో వారికి గానాభజానా చేశారు. కౌన్సిలింగ్ అంటే మాటలనుకునేదు. ఏకంగా లాఠీ దెబ్బలతో ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ కౌన్సెలింగ్ చేయించుకున్న నలుగురిలో శేఖర్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు. స్వయానా పిల్లనిచ్చిన మామనే చంపాడన్న ఆరోపణ అతడిపై వచ్చింది. కొంతకాలం వైవాహిక జీవితాన్ని బాగానే అనుభవించాడు. ఆ తర్వాత అసలు గొడవలు మొదలయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో విభేదాలు పొడచూపాయి. దీంతో శేఖర్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో ఆమె ఇంటికి వెళ్లి, రమ్మని అడగ్గా ఆమె నిరాకరించింది. దీంతో ఆమె తండ్రి మల్లన్నతో శేఖర్ గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ తీవ్రంగానే జరిగింది. ఆ తర్వాత మల్లన్నను తన స్నేహితులతో కలిసి శేఖర్ హతమార్చాడన్న ఆరోపణలు వచ్చాయి.
పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండు రోజుల్లోనే శేఖర్, అతని స్నేహితులను పట్టుకున్నారు. వారందరినీ రోడ్డుపైనే కుళ్లబొడిచారు. గుంతకల్లు డీఎస్పీ సుప్రజ లాఠీ అందుకుని శేఖర్ వీపు విమానం మోత మోగించారు.