'పవన్ కల్యాణ్ మద్దతిస్తానంటే ఆహ్వానిస్తాం'
విజయవాడ : సినీనటుడు పవన్ కల్యాణ్ ....భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానంటే ఆహ్వానిస్తామని ఆపార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. కాగా కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో' నినాదంతో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించిన పవన్ కల్యాణ్ బీజేపీకి దగ్గరవుతున్నట్టు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో వెల్లడించింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో పవన్ కళ్యాణ్ సోమవారం (నేడు) సమావేశం కాబోతున్నట్టు తన కథనంలో వెల్లడించింది. అయితే అధికారికంగా ఈ భేటికి సంబంధించిన విషయాలు వెల్లడికాలేదు.
ఇక కృష్ణాజిల్లా పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడు సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో బీజేపీది ఏ తప్పులేదని అన్నారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు ఏ పార్టీకి లేదని వెంకయ్య పేర్కొన్నారు. విభజన జరగాలని మేము కోరుకున్నామని... అయితే విభజన జరిగిన తీరు సిగ్గుచేటు అన్నారు.
భారతీయ జనతా పార్టీ హయాంలో బీసీలకు ప్రధాన్యత ఇస్తామని వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టి సోనియా చోద్యం చూస్తోందని ఆయన మండిపడ్డారు. నాయకుడు లేని పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. మోడీ ప్రధాని కాకుండా ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. మోడీపై కేజ్రీవాల్ తో పాటు ఎవరైనా పోటీ చేయవచ్చని వెంకయ్య పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామన్నారు.