
‘మా డిమాండ్లు ఒప్పుకుంటేనే ‘భూములిస్తాం’
బుద్ధవరం,(గన్నవరం) : తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకుంటేనే గన్నవరం విమానాశ్రయ భూసేకరణకు ఒప్పుకుంటామని బుద్ధవరం, కేసరపల్లి గ్రామస్తులు తెగేసి చెప్పారు. ఆయా పంచాయతీ కార్యాలయాల్లో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, తహశీల్దారు ఎం. మాధురి, పలు శాఖల అధికారులు రైతులు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
కేసరపల్లి రైతులకు చెల్లించే పరిహారాన్నే మిగిలిన రెండు గ్రామాల రైతులకూ ఇవ్వాలని కోరారు. విస్తరణ వల్ల బుద్ధవరం, దావాజిగూడెం, కేసరపల్లి గ్రామాల మధ్య నిలిచిపోనున్న రహదారి మార్గాలను, రక్షిత మంచినీటి పథకం పైపులైన్లను పునరుద్ధరించాలని చింతపల్లి సీతారామయ్య, సీపీఎం డివిజన్ కార్యదర్శి వై. నరసింహారావు కోరారు.
వారు వచ్చి ఉండాల్సింది..
రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు మంత్రి దేవినేని, జిల్లా కలెక్టర్, ఆర్డీవో కూడా వచ్చి ఉండాల్సిందని ఎమ్మెల్యే వంశీ అభిప్రాయపడ్డారు. అప్పుడే రైతుల సందేహలు నివృత్తి కావడంతో పాటు న్యాయం చేకూరుతుందని చెప్పారు. అయినప్పటికీ అందరికీ న్యాయం జరిగేలా రైతుల పక్షాన నిలుస్తానని హామీ ఇచ్చారు.
రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకుగాను టెక్నికల్ కమిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. తహశీల్దారు మాధురి మాట్లాడుతూ కొత్త భూసేకరణ చట్ట ప్రకారం గత మూడేళ్లలో జరిగిన అధిక ధర రిజిస్ట్రేషన్‌కు అనుగుణంగా పరిహరం చెల్లిస్తామన్నారు. విస్తరణ అనంతరం రోడ్లను పునరుద్ధరించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు ఆర్‌అండ్‌బీ డీఈ మహదేవ్ చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ కడియాల రాఘవరావు, వైస్ ఎంపీపీ గొంది పరంధామయ్య, సర్పంచి తిరివీధి మరియమ్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎం.వి.ఎల్. ప్రసాద్ పాల్గొన్నారు.
బుద్ధవరం, కేసరపల్లి గ్రామాల రైతుల డిమాండ్లు
గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులందరికీ కొత్త భూసేకరణ చట్ట ప్రకారం సమానమైన పరిహారం చెల్లించాలి.
ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో అయితే రాజధానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఎకరాకు 1,250 గజాల స్థలం కేటాయించాలి. పేదల ఇళ్లను భూసేకరణ నుంచి మినహాయించాలి.
ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు టెక్నికల్ కమిటీని నియమించాలి.
వి.కె.ఆర్ కళాశాలకు సేకరించనున్న భూమికి బదులు భూమిని ప్రభుత్వమే కేటాయించాలి. అప్పటి వరకు కళాశాలను ఇక్కడే కొనసాగించాలి.
విస్తరణలో భూమి పోతున్న రైతులకు మెరుగైన ప్యాకేజి ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రైతుల కుటుంబాల్లో ఒకరికి చొప్పున ఉద్యోగ ఆవకాశం కల్పించాలి.
విస్తరణ అనంతరం ప్లయింగ్ జోన్లు పేరుతో ఎయిర్‌పోర్టు అధికారులు పెట్టే నిబంధనలపైనా అవగాహన కల్పించాలి.