
ముజ్రా డ్యాన్స్‌లకు అనుమతి ఉండదు..కానీ అర్ధరాత్రి అశ్లీల నృత్యాలతో ‘జిల్ జిల్ జిగేల్ రాణి’ అని హోరెత్తి స్తారు.. క్రాస్ మసాజ్ సెంటర్లకు అనుమతి లేదు.. కానీ నగరం నడిబొడ్డునే మసాజ్ సెంటర్ల ముసుగులో మజా చేస్తారు.. అసలు పబ్‌లకు అనుమతే లేదు.. కానీ ఓ అతిపెద్ద షాపింగ్‌మాల్‌లోనే అనధికార పబ్‌లో చిందులు తొక్కుతారు.. రాజధాని విజయవాడ అంటే అదీ మరి... ఇక్కడ అనుమతులతో పని లేదు.. అక్రమాలకు పెద్దపీట వేస్తారు.. అధికార టీడీపీ పెద్దల అండ ఉంటే చాలు.. అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతుంటే.. విశృంఖలత్వం వెర్రితలలు వేస్తూ ఉంటుంది.
సాక్షి, అమరావతిబ్యూరో: అది విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఓ పెద్ద షాపింగ్‌మాల్. ఆ మాల్ పై అంతస్తులో ఓ పబ్. బడాబాబుల బిడ్డలకు అది అడ్డా. అధికారికంగా అనుమతి లేకపోయినా సరే మూడు డీజేలు... ఆరు గ్లాసులుగా అడ్డగోలు వ్యాపారం ‘ఫుల్’గా కళకళలాడుతూనే ఉంటుంది. అందులో ఓ డ్యాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేసి వీకెండ్ పార్టీల పేరుతో హల్‌చల్ చేస్తున్నా పోలీసు యంత్రాంగం పట్టించుకోదు. ప్రతి శని, ఆదివారాల్లో అక్కడ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బార్‌లకు ఇచ్చిన నిర్ణీత సమయం ముగిసినప్పటికీ ఆ పబ్‌లో మాత్రం డీజేలు, డ్యాన్స్‌లు హోరెత్తుతూనే ఉంటాయి. పోలీసుల ఉదాసీనతే ఆ పబ్ వేదికగా శనివారం అర్ధరాత్రి గ్యాంగ్‌వార్‌కు దారితీసింది. శనివారం ఆ పబ్‌లో రెండువర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి.
యాజమాన్యం ఒత్తిడికి తలొగ్గి...
దాదాపు 214 మంది ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించుకుని బీభత్సం సృష్టించారు. తప్పని పరిస్థితుల్లో పబ్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసుల రాక చూసి 10 మంది పలాయనం చిత్తగించగా నలుగురు చిక్కారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘర్షణ పడ్డ మిగిలిన 10 మంది పేర్లు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పబ్ యాజమాన్యం ఒత్తిడికి పోలీసులు తలొగ్గుతున్నట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి ఘర్షణ జరగగా ఆదివారం రాత్రి వరకు సాగదీసి ఆ నలుగురు యువకులపై కేవలం న్యూసెన్స్ కేసుతో సరిపెట్టారు. కానీ అసలు ఆ పబ్‌కు అనుమతి ఉందా? అనుమతి లేకుండా ఎలా నిర్వహిస్తున్నారనే విషయాన్నే పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే యువకుల ఘర్షణ మీదే హడావుడి చేస్తూ అనధికారిక పబ్ విషయన్ని కప్పిపుచ్చుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మామూళ్ల మత్తు...
అధికార యంత్రాంగం చిత్తు
షాపింగ్ మాల్‌ల్లోని పబ్ మాత్రమే కాదు నగరంలోని బార్లు , మద్యం దుకాణాల విషయంలో కూడా పోలీసుల వైఖరి అలానే ఉంది. జిల్లాలో 343 మద్యం దుకాణాలు, 162 బార్లు ఉన్నాయి. విజయవాడ నగరంలోనే దాదాపు 40 మద్యం దుకాణాలు, 120 వరకు బార్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు రాత్రి 10 వరకు, బార్లు రాత్రి 11 గంటలకు మూసివేయాలి. కానీ నగరంలో మద్యం దుకాణాలు, బార్లు రాత్రి 12 గంటల వరకు దర్జాగా విక్రయాలు సాగిస్తునే ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. కానీ పోలీసులు గానీ ఎక్సైజ్ అధికారులుగానీ చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. సత్యనాయణపురం, ఆటోనగర్, సింగ్‌నగర్, పటమట, కృష్ణలంక ఇలా జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రధాన రహదారులపైనే ఈ బార్లు, మద్యం దుకాణాలు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటున్నా పట్టించుకునే నాథుడే లేరు. ఇక పెద్ద షాపింగ్‌లో మాల్‌లో అనధికారికంగా నిర్వహిస్తున్న పబ్ విషయంలో పట్టించుకుంటారని ఆశించడం అత్యాశే అవుతుంది. మద్యం దుకా ణాలు, బార్లు, పబ్ యాజమాన్యాలు ఇచ్చే మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం నిబంధనలను గాలికొదిలేస్తోంది.
పెట్రేగిపోతున్న విచ్చలవీడితనం
అధికార యంత్రాంగం ఉదాసీనత రాజధానిలో విశృంఖలత్వం వెర్రితలలు వేస్తోంది. శాంతిభద్రతలకు విఘాతంగా పరిణమిస్తోంది. కొన్నిరోజుల కిందటే భవానీపురంలో టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన హోటల్‌లో ముజ్రా పార్టీ నిర్వహించడం కలకలం సృష్టించింది. ప్రతి నెలా అక్కడ ముజ్రా పార్టీ అన్నది సర్వసాధారణ అంశంగా మారింది. మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అనధికార పబ్‌లు, అందులో దాడుల ఘటనలు రాజధానిలో గాడితప్పుతున్న వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. యువత పెడదారిపడుతున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండం విస్మయపరుస్తోంది. విజయవాడలో పెట్రేగుతున్న పెడధోరణులపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment