వారానికి ఒక్కరోజే!
వారానికి ఒకరోజు.. అనగానే వారాంతపు సెలవు గురించే ప్రస్తావిస్తున్నామనుకుంటున్నారా!.. అలా అనుకోవడం సహజమే కానీ.. మనం ఇక్కడ చెప్పుకొనేది వారాంతపు సెలవు గురించి కాదండోయ్!!.. వారంలో ఏడు రోజులుంటే ఉద్యోగులు, వ్యాపారులు.. ఆరు రోజులు పని చేసి.. ఏడో రోజు సెలవు తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే.. కానీ ఒక జిల్లాస్థాయి కార్యాలయ అధికారి మాత్రం దీనికి పూర్తి రివర్స్‌లో పని చేస్తున్నారు. ఆయన పని చేసేది వారంలో ఒక్కరోజే.. మిగిలిన రోజులు ఆయన ఏం చేస్తున్నారో గానీ ఇదే అదనుగా కార్యాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మాజీ సైనికులు, వారి కుటుంబాలతో ఆడుకుంటున్నారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమాన్ని చూడాల్సిన కార్యాలయం పర్యవేక్షణ లేక గాడి తప్పుతోంది. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయానికి పూర్తిస్థాయి అధికారి లేకపోవడం, అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారి వారంలో ఒక్కరోజే కార్యాల యానికి వస్తుండటంతో పనులు పెండింగులో పడిపోవడమే కాకుం డా సిబ్బంది ఆడిందే ఆటగా వ్యవహారం సాగుతోంది. మాజీ సైనికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, రాయితీలకు సంబంధించి ఈ కార్యాలయమే ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారి పర్యవేక్షణ లోపించడంతో కార్యాలయ సిబ్బంది ఒక్కో సర్టిఫికెట్‌కు ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. మాజీ సైనికుడిగా నిర్థారించే గుర్తింపు కార్డు ఇవ్వాలంటే రూ.500 చెల్లించాల్సిందేనని పలువురు మాజీ సైనికులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకునేందుకు వెళ్లే వారి పట్ల సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రెచ్చిపోయి నోరుపారేసుకుంటున్నారు.
బదిలీ.. ఆ వెంటనే అదనపు బాధ్యతలు
పూర్తిస్థాయి అధికారి లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని మాజీ సైనికులు వాపోతున్నారు. గత కొంత కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. 2003 నుంచి ఆరేళ్లపాటు జిల్లా సైనిక సంక్షేమాధికారిగా పని చేసిన అధికారి 2009లో విజయనగరం జిల్లాకు బదిలీ అయ్యారు. వెళ్లిన కొద్దిరోజులకే శ్రీకాకుళం జిల్లా కార్యాలయ ఇన్‌చార్జిగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) కూడా అంది పుచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి విజయనగరంలో విధులు ఎలా నిర్వర్తిస్తున్నారన్నది పక్కనపెడితే.. శ్రీకాకుళం కార్యాలయానికి మాత్రం వారంలో ఒక్కరోజే (మంగళవారం) వస్తున్నారు. ఈ విషయాన్ని సదరు అధికారే అంగీకరిస్తున్నారు.
పెండింగులో ఫైళ్లు, ధ్రువపత్రాలు
ప్రభుత్వ కార్యాలయాల్లో రోజూ విధులు నిర్వహిస్తున్నా ఫైళ్లు, పనులు పెండింగులో ఉండిపోతున్నాయి. అలాంటిది ఒక జిల్లాస్థాయి అధికారి వారానికి ఒకరోజు... నెలలో నాలుగు రోజులే విధులకు హాజరైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫైళ్లు పరిష్కారం కాక పెద్ద సంఖ్యలో పెండింగులో ఉండిపోతున్నాయి. ఇక వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు అధికారి సంతకానికి నోచుకోక ఫైళ్లలో మగ్గిపోతున్నాయి. దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. నిర్ణీత గడువులోగా ధ్రుపపత్రాలు అందక ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతున్నామని మాజీ సైనికులు, వారి కుటుంబాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ జాప్యాన్నే అనువుగా మలచుకుంటున్న సిబ్బంది పని తొందరగా జరగాలంటే చెయ్యి తడపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో 4575 మంది మాజీ సైనికులు
త్రివిద దళాల్లో(ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ సైనికులు, వితంతువులు జూలై 31 నాటికి జిల్లాలో 4575 మంది ఉన్నారు. వీరందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయానిదే. దేశ రక్షణలో ఆహారహం శ్రమించిన తమ పట్ల కార్యాలయ సిబ్బంది ప్రవరిస్తున్న తీరుపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మాజీ సైనికుల వివరాలు
కేటగిరీ ఆర్మీ నేవీ ఎయిర్‌ఫోర్స్ మొత్తం
మాజీ సైనికులు 3507 193 123 3823
వితంతువులు 717 20 15 752
నిజమే..కానీ..!
వారానికి ఒక్కరోజు విధులకు హాజరవుతున్న మాట వాస్తవమే. నాకు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. అయితే దీని వల్ల రోజువారీ పనులకు ఇబ్బంది ఉండదు. తాహశీల్దార్ కార్యాలయాల మాదిరిగా మా కార్యాలయంలో సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి తిప్పం. క్షణాల్లో జారీ చేసేస్తాం. ఫైళ్లను కూడా పెండింగ్‌లో ఉంచం. వారం రోజుల ఫైళ్లు ఒకేసారి పరిష్కరించేస్తాం. సిబ్బంది చేతివాటం గురించి నాకు తెలీదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తా.
- వి.వి.రాజారావు, మాజీ సైనిక సంక్షేమాధికారి