జగన్‌కు జన స్వాగతం
=పెద్దవెలగటూరుకు తరలివచ్చిన కర్ణాటక అభిమానులు
=వృద్ధులను ఆప్యాయంగా పలకరించిన జగన్
=అనంతపురం బయల్దేరి వెళ్లిన జననేత
పెద్దపంజాణి, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అడుగడుగునా అభిమానులు నీరాజనాలందించారు. శనివారం వేకువజామునుంచే అభిమానులు పెద్ద సంఖ్యలో పెద్దవెలగటూరుకు తరలివచ్చారు. జననేత జయరామిరెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాగానే జై జగన్, వైఎస్సార్ జిందాబాద్ అంటూ అభిమానుల నినాదాలతో ఆ గ్రామం దద్దరిల్లిపోయింది.
కర్ణాటక రాష్ట్రం ఉగిని, హెబ్బిణి, బైరుకూరు, చిన్న నగవారం తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పెద్దవెలగటూరుకు చేరుకొని జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆనంతరం ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతపురం వెళుతున్న జగన్‌ను చూసేందుకు జనం నిరీక్షిం చారు. రాజుపల్లెకు చేరుకోగానే పాఠశాల విద్యార్థులు, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన అభిమానులు భారీగా రావడంతో ఆయన వాహనం నుంచి దిగి అభిమానులను ఆప్యాయంగా పలకరించారు.
జన నేత కోసం గంటల తరబడి వేచివున్న అభిమానులు ఆయన రాకతో కేరింతలు కొట్టారు. వారి అభిమానానికి పరవశించిపోయిన జగన్ కాన్వాయ్‌ను ఆపారు. రాజుపల్లె గ్రామస్తులు ఆయనకు పూల వర్షం కురిపించారు. రాజుపల్లెలో మాజీ ఎమ్మెల్యే, పలమనేరు నియోజకవర్గ కన్వీనర్ అమరనాథరెడ్డి కమ్మినాయనిపల్లెకు చెందిన భాను ప్రతాప్‌రెడ్డిని జగన్‌మోహన్‌రెడ్డికి పరిచయం చేశారు.
అనంతరం చీమనపల్లె రోడ్డు పక్కన ఉన్న మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. ‘‘మీ చల్లని చూపే నాకు శ్రీరామ రక్ష’’ అంటూ వృద్ధుల వద్ద ఆశీర్వచనా లు తీసుకున్నారు. ఆయన తోపాటు జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణ స్వామి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు మిథున్‌రెడ్డితో పాటూ పలువురు ముఖ్య నేతలున్నారు.