పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రైతు దీక్ష చేపట్టేందుకు శనివారం జిల్లాకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై తూర్పుగోదావరి జిల్లా ప్రజలు...
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రైతు దీక్ష చేపట్టేందుకు శనివారం జిల్లాకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అడుగడుగునా ఆదరాభిమానాలు చూపించారు. హైదరాబాద్ నుంచి విమానంలో శనివారం ఉదయం మధురపూడికి చేరుకున్న జగన్‌కు జిల్లా నలుమూలల నుంచీ తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో వారంతా విమానాశ్రయంలో పార్టీ అధినేతను కలుసుకున్నారు. అక్కడ నుంచి జగన్ తణుకు బయలుదేరారు. రావులపాలెం సమీపంలో గోపాలపురం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యాన రైతులు, మహిళలు, పార్టీ నేతలు ఎదురేగి జగన్‌కు స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మోటార్‌సైకిళ్లు, ఆటోలతో ర్యాలీగా తణుకులోని దీక్షాస్థలికి తరలివెళ్లారు.
జగన్‌మోహన్‌రెడ్డి వెంట జ్యోతుల నెహ్రూతో పాటు ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యేలు కుడుపూడి చిట్టబ్బాయి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, అల్లూరు కృష్ణంరాజు, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, జడ్‌పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, జిల్లాలోని పలు నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లు తణుకు వెళ్లారు.