
పేదల పాకలు తొలగింపు...ఉద్రిక్తత
=భారీగా మోహరించిన పోలీసులు
= రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ
= సీపీఐ నాయకుల అరెస్టు -విడుదల
=ఇళ్లస్థలాలిస్తామని అధికారుల హామీ
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : ఇబ్రహీంపట్నం జూపూడి డొంకరోడ్డులో పేదలు వేసుకున్న పాకల తొలగింపు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డొంకరోడ్డు సమీపంలోని దాదాపు 35 ఎకరాల సీలింగ్‌భూముల్లో వామపక్షాల ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి కుటుంబాలు పాకలు వేసుకుని జీవిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాన్ని ఖాళీచేయాలని రెవెన్యూ అధికారులు పలుమార్లు కోరినా పేదలు ఖాతరు చేయలేదు. దీంతో భారీ పోలీసు బలగాల మధ్య బుధవారం ఉదయం 5గంటల నుంచే ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు.
మంగళవారం అర్ధరాత్రికే 9 మంది తహశీల్దార్లు, సబ్‌కలె క్టర్ హరిచందన సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. కొద్ది సేపటికే నగర డీసీపీ రవిప్రకాశ్ ఆద్వర్యంలో 600 మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు చర్చించుకున్న అనంతరం ఉదయం 5 గంటల సమయంలో పాకల తొలగింపునకు శ్రీకారం చుట్టగా... పాకలు తొలగించడానికి వీలులేదని అడ్డు తగలబోయిన సీపీఐ నాయకులు టీ తాతయ్య, ఎన్.విఘ్నేశ్వరరావులతో పాటు 30 మందిని అదుపులోకి తీసుకుని నగరంలోని పలు పోలీసు స్టేషన్లకు తరలించారు.
అనంతరం 13 జేసీబీలను పెట్టి పాకలను తొలగించారు. పాకల్లో ఉన్న సామగ్రిని తీసుకువెళ్లి పాకల తొలగింపునకు సహకరించాలని అధికారులు సూచించారు. దీంతో కొంతమంది స్వచ్ఛందంగా పాకలు తొలగించుకున్నారు. మరి కొన్ని పాకలను రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించారు. తొలగించిన రెల్లి గడ్డి వాసాలను గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో పశ్చిమ ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టె ర్మినల్‌కు తరలించారు.
ఇబ్రహీంపట్నం గ్రామ మాజీ సర్పంచి మల్లెల పద్మనాభరావు స్వాధీనంలో ఉన్న ఈ భూమిలో ఆరు నెలల క్రితం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పాకలు నిర్మించుకున్నారు. అయితే అర్హులైన వారిని తామే ఎంపిక చేసి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని... అప్పటి వరకు ఆ భూములను ఖాళీ చేసి వెళ్లిపోవాలని తహశీల్దార్ ఎం.మాధురి కోరుతూ వచ్చారు. అయినా బాధితులు వినకపోవడంతో ఖాళీ చేయించాల్సి వచ్చిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. పేద ప్రజలకు తప్పకుండా ఇళ్లస్థలాలు ఇస్తామని తహశీల్థారు ఎం.మాధురి హామీ ఇచ్చారు. అరెస్ట్ చేసిన సీపీఐ నాయకులను సాయంత్రం బెయిల్‌పై విడుదల చేశారు. జాయింట్ కలెక్టర్ ఉషారాణి , సబ్ కలెక్టర్ హరిచందన, నగర డీసీపీ రవిప్రకాశ్, ఏసీపీలు రాఘవరావు,శ్రీనివాసరావు, ఇబ్రహీంపట్నం సీఐ కనకారావు, ఒన్‌టౌన్ సీఐ కనకారావు, 25 మంది ఎస్‌ఐలు బందోబస్తును పర్యవేక్షించారు.