
బాల్య వివాహానికి బ్రేక్
కన్నీటి పర్యంతమైన బాలిక కుటుంబీకులు అధికారులపై ఆగ్రహం
పెద్దేముల్: మరో అరగంటలో వివాహం జరగాల్సి ఉండగా పోలీసులు, రెవెన్యూ అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన బుధవారం రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని అడ్కిచెర్ల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయిని నీలమ్మ, లక్ష్మప్ప దంపతుల రెండో కూతురు (16)ను బషీరాబాద్ కాశీంపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. బుధవారం ఉదయం 11 గంటలకు పెళ్లి ముహూర్తం. దీంతో కుటుంబీకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
బంధువుల కోసం వంటలు కూడా చేశారు. మరో 30 నిమిషాల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెద్దేముల్ తహసీల్దార్ గంగాధర్, ఎస్‌ఐ కృష్ణ, చైల్డ్‌లైన్ అధికారులు అక్కడికి చేరుకొని పెళ్లిని నిలిపివేశారు. వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. మైనారిటీ తీరిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేయాలని స్పష్టం చేశారు. లేదంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అధికారులు పెళ్లిని అడ్డగించడంతో బంధువులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వధువు కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు.
బోనఫైడ్‌లు చూడాలి..
గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయని, పురోహితులు అమ్మాయిల బోనఫైడ్ సర్టిఫికెట్లు చూసి పెళ్లిళ్లు చేయాలని తహసీల్దార్ స్పష్టం చేశారు. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పీటల మీద ఆగిన పెళ్లి..
షాబాద్: పీటల మీద పెళ్లి ఆగిపోయింది. బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మద్దూరులో బుధవారం చోటుచేసుకుంది. ఆర్‌ఐ రాజు, ఏఎస్‌ఐ శంకరయ్య కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాగుల పెంటయ్య కూతురు(15)ను అదే గ్రామానికి చెందిన కప్పెర యాదయ్య కుమారుడు ప్రకాశ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు బుధవారం ఇరువర్గాల వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మరో 20 నిమిషాల్లో పెళ్లి జరగాల్సి ఉండగా అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. బాలికను నగరంలోని శిశువిహార్‌కు తరలించారు. అమ్మాయి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.