ప్రతీకాత్మక చిత్రం
జైపూర్ : తల్లిదండ్రుల మాట నిలబెట్టాలనే వేధింపులు తట్టుకోలేక పోలీసుల ముందే ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోద్‌పూర్ పోలీసు స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. జోధ్‌పూర్‌కు చెందిన దివ్యా చౌదరి(22) అనే యువతికి మూడేళ్ల వయస్సు ఉన్నపుడు జీవ్‌రాజ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తామని ఆమె తల్లిదండ్రులు మాట ఇచ్చారు. దీంతో దివ్యానే తమ ఇంటి కోడలు అని జీవ్‌రాజ్ కుటుంబ సభ్యులు భావించేవారు. ఈ క్రమంలో యుక్త వయసు రాగానే వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో గత కొన్ని రోజులుగా.. జీవ్‌రాజ్‌ను త్వరగా పెళ్లి చేసుకొని, తమ ఇంటికి రావాలంటూ దివ్యపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు.
ఈ క్రమంలో తన ప్రమేయం లేకుండా తల్లిదండ్రులు ఇచ్చిన మాటకు కట్టుబడేది లేదని, తను జీవ్‌రాజ్‌ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని దివ్య తేల్చి చెప్పింది. దీంతో ఈ విషయాన్ని పంచాయతీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు అతడి కుటుంబ సభ్యులు. దివ్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంచాయతీ పెద్దలు పెళ్లికి అంగీకరించకపోతే 16 లక్షల రూపాయల జరిమానా కట్టాలని తీర్పునిచ్చారు. అయితే వారి మాటలను ఖాతరు చేయకుండా దివ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెలి వేస్తాం జాగ్రత్త..
ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ పెద్దలు 20 లక్షల రూపాయలు కట్టకపోతే దివ్య కుటుంబాన్ని వెలి వేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో దివ్య మరోసారి పోలీసులను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, ఉద్యోగం సంపాదించిన తర్వాతే తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకుంటానని పోలీసులతో చెబుతున్న క్రమంలో విషం తాగింది. దీంతో దివ్యను వేధించిన జీవ్‌రాజ్ కుటుంబ సభ్యులు, పంచాయతీ పెద్దలపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ అమన్ సింగ్ తెలిపారు. దివ్య మొదటిసారి ఫిర్యాదు చేసినపుడు స్పందించకుండా నిర్లక్ష్యం చేసిన స్థానిక పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment