
ఏమైంది?
♦ గాలిలో అరగంట చక్కర్లు కొట్టిన విమానం
♦ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల బంధువుల్లో ఆందోళన
♦ 45 నిమిషాలు ఆలస్యంగా బెంగళూరుకు పయనం
సాక్షి ప్రతినిధి, కడప : కడప-బెంగుళూరు మధ్య నడుస్తోన్న విమానం గురువారం ఉదయం కడపలో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించక అరగంటకు పైగా గాలిలో చక్కర్లు కొట్టింది. కారు మబ్బులు, చిరు జల్లుల మధ్య పెద్ద శబ్ధంతో విమానం అలా గాలిలో రౌండ్లు కొడుతుంటే నగర వాసులు ఉత్కంఠకు గురయ్యారు. ఎట్టకేలకు ఏటీసీ అనుమతితో విమానాన్ని పెలైట్ సురక్షితంగా కిందకు దించారు. 45 నిమిషాలు ఆలస్యంగా టేకాఫ్ తీసుకొని బెంగుళూరుకు వెళ్లింది. ఎయిర్ పెగాసెస్‌కు చెందిన విమానం బెంగుళూరులో ఉదయం 10.45 గంటలకు కడపకు బయలుదేరింది.
11.30 గంటలకు కడపలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో అరగంటపాటు గాలిలోనే పెలైట్ చక్కర్లు కొట్టించారు. ఏమైందో అర్థం కాక అందులో ఉన్న 30 మంది ప్రయాణికులు ఆందోళనకు లోనయ్యారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన బంధువులు సైతం హైరానా పడ్డారు. వాతావరణం అనుకూలించనప్పుడు ఇది మామూలేనని, ఆందోళన అక్కరలేదని ఎయిర్‌పోర్టు డెరైక్టర్ శ్రీనివాసన్ ప్రయాణికుల బంధువులను సముదాయించారు.
అరగంట తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంద రూ ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి 12.25 గంటలకు టేకాఫ్ తీసుకొని అదే విమానం ప్రయాణికులతో బెంగుళూరుకు వెళ్లిపోయిం ది. విమానాశ్రయాల సమీపంలో ఈ తరహా ఘటన లు మామూలే. కడపలో ఇటీవలే విమానాశ్రయం ప్రారంభమైంది. దీంతో ఏమైందోనని పలువురు ఉత్కంఠకు లోనయ్యారు.