రుణ మాఫీకి రూట్‌మ్యాప్ ఏది? | What is the root of the map to forgive the debt? | Sakshi
Sakshi News home page

రుణ మాఫీకి రూట్‌మ్యాప్ ఏది?

Published Wed, Sep 10 2014 1:43 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM

ఇదీ తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టోలో విస్పష్టంగా పేర్కొన్న హామీ. కానీ అధికారంలోకి రాగానే రుణమాఫీపైనే దృష్టిపెట్టినా...

స్పష్టతలేని సర్కారు
భారం తగ్గించుకోవడంపైనే దృష్టి
షరతులతో కాలయూపన
విపక్షాల నిరసనతో  కొన్ని షరతులపై వెనక్కు
పెద్దగా ఫలితమివ్వని రీషెడ్యూల్ యుత్నం

 

 రైతులందరికీ లక్ష రూపాయల రుణ మాఫీ..

ఇదీ తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టోలో విస్పష్టంగా పేర్కొన్న హామీ. కానీ అధికారంలోకి రాగానే రుణమాఫీపైనే దృష్టిపెట్టినా... వాస్తవ స్ఫూర్తితో అమలు దిశలోగాకుండా గరిష్టంగా ఎంత భారాన్ని తగ్గించుకోగలమనే దిశలోనే మల్లగుల్లాలు పడుతోంది. బేషరతుగా రైతులందరికీ మాఫీ వర్తింపచేయకుండా... రోజుకోరకం ఆలోచనతో ఖజానాకు ఎంత మిగులుతుందనే ఆలోచనలకే ప్రాధాన్యమిస్తోంది. మాఫీపై బ్యాంకర్లతో జూన్ నాలుగవ తేదీన  జరిగిన తొలి సమావేశంలోనే గతేడాది తీసుకున్న పంటరుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం ఓ విధాన నిర్ణయం తీసుకుంది. తద్వారా 23 లక్షల మంది రైతులకు 12 వేల కోట్ల రూపాయుల రుణమాఫీ అవుతుందని ప్రకటించింది. కానీ ఆచరణకొచ్చేసరికి ప్రభుత్వ సలహాదారు ఒకరు రుణ మాఫీ రూ. 10 వేల కోట్లకు మించరాదంటూ బ్యాంకర్లకు సూచించారు. దీంతో బంగారం తాకట్టు రుణాలు, పాత బకాయిలకు మాఫీ వర్తించబోదనే విషయం బయటికొచ్చింది. దీనిపై రైతులు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు, నిరసనలు వ్యక్తం కావడంతో... దానిని సవరించుకుని అందరికీ మాఫీ వర్తింప చేస్తామంటూ సీఎం కేసీఆర్ ఢిల్లీలో ప్రకటన చేయాల్సి వచ్చింది.

►తెలంగాణలో అన్ని రకాల రైతు రుణాలు రూ. 30,610 కోట్లు ఉండగా.. రూ. లక్ష లోపు రుణాలు రూ.26,490 కోట్లుగా బ్యాంకర్లు లెక్కలు తేల్చారు. రైతు రుణాలు తమ ముందస్తు అంచనాల కంటే అధికంగా ఉండడంతో ఇక ప్రభుత్వం రుణ భారం తగ్గించుకునే ప్రయత్నాలకు దిగింది.
►దీర్ఘకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలుగా మారిన పంటరుణాలు, పరోక్ష రుణాలకు మాఫీ ఉండదని తొలి దశలోనే ప్రభుత్వం స్పష్టీకరించింది. దీంతో ఈ మాఫీ భారం కాస్తా రూ.23,190 కోట్లకు తగ్గిపోయింది. ఇవి కేవలం అంచనాలుగా మాత్రమే పేర్కొంటూ, ప్రభుత్వానికి పక్కా సమాచారం ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లను ఆదేశించింది. క్షేత్ర స్థాయి వివరాల సేకరణ తరువాత 31 మార్చి 2014 వరకు ఉన్న పంట, బంగారం తాకట్టు రుణాలను రూ. 17,337 కోట్లుగా తేల్చారు.

తాత్కాలిక ఉపశవునం కోసం రీ షెడ్యూల్ యత్నం!

రుణాలన్నీ మాఫీ చేస్తామన్న ప్రభుత్వానికి... ఆచరణకొచ్చేసరికి బ్యాంకులకు రుణమొత్తం ఒకేసారి చెల్లించడం సాధ్యం కాదని తెలిసొచ్చింది. తక్షణం కొంత ఉపశవునం పొందడం కోసం, కొంత టైమ్ కలిసొస్తుందనే భావనతో రీషెడ్యూల్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. కరువు, వరదలతో నష్టాలు వాటిల్లినందున 415 మండలాల్లో రీషెడ్యూల్ చేయాలని రిజర్వు బ్యాంకును కోరింది. కొంత కాలయాపన, మార్గదర్శకాల పేరిట అభ్యంతరాలు, తర్వాత ప్రభుత్వ సమాధానాల దశ దాటాక ఎట్టకేలకు రిజర్వు బ్యాంకు కేవలం 3 జిల్లాల్లోని 100 మండలాల్లో రీషెడ్యూల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ.1,500 కోట్ల వరకు కొంత వెసులుబాటు దొరికినట్లయింది. అరుునా రుణమాఫీకోసం బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం రూ.15,837 కోట్ల మేర ఉంది.  

కుటుంబానికి లక్ష మాత్రమే!

ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం రైతులంతా తమ రుణాలన్నీ లక్ష రూపాయల మేరకు మాఫీ అవుతాయని ఆశించారు. కానీ భారం తగ్గింపు సాకుతో ప్రభుత్వం ఎన్నిరకాల ఖాతాలు ఉన్నా కుటుంబంలో గరిష్టంగా ఒక లక్ష రూపాయలకే మాఫీ వర్తిస్తుందనే కొత్త మెలిక పెట్టింది. కుటుంబం అంటే... భర్త, భార్య, వారిపై ఆధారపడిన ఇద్దరు పిల్లలు అని నిర్వచించింది. ఆ తరువాత అర్హులైన లబ్ధిదారుల జాబితాలను పంచాయతీల్లో ప్రకటించి, సామాజిక తనిఖీ నిర్వహించాలని నిర్ణయించింది. నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు తీసుకున్న వారిని గుర్తించసాగింది. పట్టణాలు, నగరాల్లోని బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంటరుణాలను మాఫీ చేయాల్సిన అవసరం లేదంటూ తాజాగా అధికారుల బృందం నిర్ణయించింది. తద్వారా అదనంగా వందలకోట్ల రూపాయల మేరకు భారం తగ్గుతుందన్న ఆలోచనలో ఉంది. ఇవన్నీ చేస్తున్నా ఏ రీతిలో బ్యాంకులకు ఈ మొత్తాన్ని చెల్లించాలనే విషయంలో ప్రభుత్వానికే ఇంకా స్పష్టత లేదు. రకరకాల వూర్గాలను ఆలోచించిందే తప్ప ఇప్పటికీ తను ఫలానా విధానంలో మాఫీ అమలు చేస్తానని చెప్పడం లేదు.
 ఆలోచించిన వూర్గాలు ఇవీ...

►  రాష్ట్ర ప్రభుత్వమే అర్హులైన రైతులకు బాండ్లు జారీ చేసి, తరువాత నిర్ణీతకాలం తరువాత వడ్డీతో సహా చెల్లించడం.
► బాండ్లు ఇస్తే, అవీ రుణాల లెక్క కిందకే వస్తాయి కాబట్టి, రైతులకే హామీపత్రాలు (ప్రామిసరీ) ఇవ్వడం.
►  రైతులు మొదట తమ రుణాలను తిరిగి చెల్లించేస్తే, కొంతశాతం సొమ్ము ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లోకి వేసి, మిగతాది దశలవారీగా చెల్లించడం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement