అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఉనికిని చాటుకోవాలనే ఉద్దేశంతో నానాపాట్లు పడుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు ఎరగా వేయాలని చూస్తున్నారు. వాటిని తామే ప్రవేశ పెట్టించామనే భావనను కల్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.
చివరకు స్త్రీశక్తి భవనాల విషయంలోనూ రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. వాటిని మహిళలు స్వయంగా ప్రారంభించకుంటే తమకు ఎలాంటి ఉపయోగమూ ఉండదని భావించి తాము రిబ్బన్ కటింగ్ చేసే వరకూ వేచి చూడాల్సిందేనంటూ స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీలు)పై ఒత్తిడి తెస్తున్నారు. ఫలితంగా జిల్లాలో 30 స్త్రీ శక్తి భవనాలు నెలలు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు.
జిల్లాలోని ఎస్‌హెచ్‌జీల సభ్యులు మండల సమాఖ్య సమావేశాలను నిర్వహించుకునేందుకు, ఉపాధి హామీ పథకం అమలు తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ఉపయోగపడేలా 63 మండల కేంద్రాల్లోనూ పక్కా భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి స్త్రీశక్తి భవనాలుగా నామకరణం చేసింది.
ఒక్కో భవనానికి రూ.25 లక్షల చొప్పున 63 భవన నిర్మాణాలకు రూ.15.72 కోట్ల నిధులను ఉపాధి హామీ పథకం కింద రెండేళ్ల క్రితం మంజూరు చేసింది. నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్, పనుల పర్యవేక్షణను ఐకేపీ అధికారులకు అప్పగించింది. ఐకేపీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. 63 భవనాల్లో 50 పూర్తయ్యాయి. పూర్తయిన వాటిలో 20 మాత్రమే ప్రారంభానికి నోచుకున్నాయి. వీటిలోనూ చాలా వరకు నిరుపయోగంగా మారాయి. మిగిలిన 30 భవనాలు ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తున్నాయి.
12 భవనాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఆత్మకూరు మండలంలో ఇంకా పనులే ప్రారంభించలేదు. ఫలితంగా 50 మండల సమాఖ్యల కార్యాలయాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఒక్కో భవనానికి నెలకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.లక్ష అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. పంచాయతీరాజ్ అధికారులను సమన్వయపరచి స్త్రీశక్తి భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు ఐకేపీలో ఓ అధికారిణిని ప్రత్యేకంగా నియమించారు. ఆమె కేవలం కార్యాలయానికి పరిమితం అవుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో ఎన్ని భవనాలు పూర్తయ్యాయన్న సమాచారం కూడా తెలియని స్థితిలో ఉన్నారు.
రాజకీయ పెద్దల పెత్తనం
ప్రభుత్వ నిధులతో ఎక్కడ ఏ అభివృద్ధి పని చేపట్టినా కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. అధికారులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరగాల్సిన నిర్మాణాలను సైతం తమ అనుచరులు, కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. కాంట్రాక్టర్లు నేరుగా పనులు చేయడానికి నిబంధనలు అంగీకరించక పోవడంతో మహిళల ముసుగులో పనులు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కొన్ని మండలాల్లో స్త్రీశక్తి భవనాల పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఇసుక, ఇటుకలు, ఇనుము తదితర నిర్మాణ సామగ్రి నాసిరకమైనవి వాడుతున్నారన్న ఆరోణలున్నాయి. ప్రస్తుతం నిర్మించిన భవనాల్లో అధిక శాతం నాసిరకంగా ఉన్నట్లు సమాచారం. నాణ్యత లేని తలుపులు అమర్చి బిల్లులు దండుకున్నట్లు తెలుస్తోంది.
తీరిక లేదట!
Published Sun, Jan 19 2014 2:51 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement