ఏం తిప్పలో..! | what problems..! | Sakshi
Sakshi News home page

ఏం తిప్పలో..!

Published Wed, Feb 5 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

what problems..!

 సాక్షి, కడప: గ్యాస్‌కు ఆధార్ అనుసంధానం పింఛనుదారులకు పెద్ద కష్టాన్ని తెచ్చి పెట్టింది. బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ మొత్తం జమ అయినా సొమ్ము చెల్లింపులో ఐసీఐసీఐ బ్యాంక్ అధికారుల  నిర్ల క్ష్యం వహిస్తూ లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. మూడు నెలలుగా సమస్యను ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు, కలెక్టర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య మాత్రం పరిష్కరం కాలేదు. ఈ బ్యాంకుకు గ్యాస్ ఆధార్ అనుసంధానం అయిన వారంతా పేదలు, పింఛనుపై ఆధారపడే పండుటాకులే. అయితే వీరికి సంబంధం లేకుండానే తమ పింఛను ఖాతాలు ఐసీఐసీఐ బ్యాంకులో ఉండటంతో గ్యాస్ సబ్సిడీకి అనుసంధానం చేశారు. అయితే ఇంతవరకు వారి ఖాతాల్లో మాత్రం సబ్సిడీ సొమ్మును జమ చేయలేదు.
 
 దీంతో పేద మహిళలు పలుసార్లు బ్యాంకుల చుట్టూ తిరిగినా నిర్లక్ష్య సమాధానమే ఎదురవుతోంది. అర్జీ ఇచ్చి వెళ్లండి అంటున్నారే తప్ప సబ్సిడీ మాత్రం ఎప్పుడు పడుతుందో చెప్పడంలేదు. ఇలా బ్యాంకు చుట్టూ తిరిగి అలసి పోయిన పేదలు లీడ్ బ్యాంకు మేనేజరు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఇలా వేలాది సంఖ్యలో పింఛన్‌దారులు పడుతున్న కష్టాలను సాక్షాత్తు కలెక్టర్ గమనించి మానవత్వంతో స్పందించి బ్యాంకర్ల సమావేశంలో సైతం వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అయినప్పటికి బ్యాంకు అధికారుల్లో స్పందన కరువైంది.
 
 అనుసంధానంతో తప్పని తిప్పలు!
 కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలి గ్యాస్‌తో ఆధార్ అనుసంధానం అవసరం లేదని చెప్పినప్పటికీ గ్యాస్ కంపెనీలు మాత్రం ఇంతవరకు తమకు ఉత్తర్వులు అందలేదంటూ లబ్ధిదారుల నుంచి ఒక్కో సిలిండర్‌కు రూ.1380 ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు ఎవరికి చెప్పుకోలేక అయోమయానికి గురవుతున్నారు.
 
 ఇప్పటికే గ్యాస్‌తో ఆధార్‌కు అనుసంధానం చేసుకున్న వారి పరిస్థితి ఘోరంగా తయారైంది. సబ్సిడీ మొత్తం బ్యాంకు ఖాతాల్లో జమకాలేదంటూ లీడ్ బ్యాంకు కార్యాలయంలో ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దీనికితోడు ముఖ్యంగా బ్యాంకు అకౌంటుతో ఆధార్ అనుసంధానం అయినప్పటికీ దానిని ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో లింకు చేయాలి. బ్యాంకులకు సంబంధించి రీజినల్ ఆఫీసుల్లో మాత్రమే వారంలో ఒకరోజు మాత్రమే దీనికి కేటాయిస్తుండడంతో బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ కావడంలో జాప్యం జరుగుతోంది. ఎన్‌పీసీఐతో అనుసంధానమైనా సర్వర్ డౌన్ కావడం, కనెక్ట్ కాకపోవడంతో నో రెస్పాన్స్ ఫ్రం ఎన్‌పీసీఐ అని రావడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంటోంది. బ్యాంకులు కూడా లబ్ధిదారులకు అవగాహన కల్పించి సబ్సిడీ మొత్తం జమ అవుతుందనే భరోసా కల్పించడంలో విఫలమవుతూనే ఉన్నాయి. కొంతమంది లబ్ధిదారులకు వారి అకౌంట్లకు బదులు వేరేవారి అకౌంట్లను తప్పుగా అనసంధానం చేయడంతో కూడా సమస్య జటిలంగా మారింది.
 
 సరిదిద్దేయత్నం చేస్తున్నాం
 గ్యాస్‌కు సంబంధించి సబ్సిడీ మొత్తం తమ ఖాతాల్లో జమకాలేదని పేదల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. వారి సమస్యల పరిష్కారం కోసం వివిధ బ్యాంకుల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. ఐసీఐసీఐ బ్యాంకులో జమ అయిన సొమ్ము లబ్ధిదారుల ఖాతాలకు అందడం లేదని తమ దృష్టికీ వచ్చింది. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం.
 - రఘునాథరెడ్డి, లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్
 
 ‘ఈ మహిళ పేరు సయ్యద్ షంషాద్. ఆధార్ నెంబరు 962089739413. ఈమె అక్టోబరు 23వ తేదీన క్యాష్‌మెమో 3000046317 ద్వారా రూ. 1094 చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసింది. సబ్సిడీ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు డీబీటీఎల్ రీఫిల్ డీటైల్ ద్వారా సమాచారం వచ్చింది. సబ్సిడీ మొత్తం రాలేదంటూ ఈ మహిళ పదిసార్లు బ్యాంకు అధికారుల చుట్టూ తిరిగింది. డబ్బు ఎప్పుడు వస్తుందో కనీసం బ్యాంకు అధికారులు చెప్పలేదు. ఫిర్యాదు చేసి పోవాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు.
 
 ‘‘ ఈ లబ్ధిదారుని పేరు ఎస్.ఖాసింసాహెబ్. ఏపీజీబీ మోచంపేట బ్యాంకులో ఇతనికి ఖాతా ఉంది. అయినప్పటికీ ఇతనికి సంబంధం లేకుండానే ఐసీఐసీఐ బ్యాంకు వారు తమ పింఛన్ ఖాతాలోనే గ్యాస్‌సబ్సిడీకి అనుసంధానం చేశారు. నవంబరు 22వ తేదీన రూ. 1042, జనవరి 6, 2014న రూ. 1345 చెల్లించి సిలిండర్లను తీసుకున్నారు. సబ్సిడీ మొత్తం ఇంకా జమకాలేదు. పలుమార్లు బ్యాంకు అధికారులకు, లీడ్ బ్యాంకు అధికారుల దృష్టికి తెచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు మాత్రం స్పందించడం లేదు.’’
 
 ‘‘ఈమె పేరు బుశెట్టి రామలక్షుమ్మ. జమ్మలమడుగు నాగులకట్ట వీధికి చెందిన ఈమెకు ఏపీజీబీ బ్యాంకులో ఖాతా ఉంది. అయినప్పటికీ ఈమె ప్రమేయం లేకుండానే ఐసీఐసీఐ బ్యాంకులో అనుసంధానమైంది. సబ్సిడీ మొత్తం జమ అయినట్లు ఈమెకు సమాచారం వచ్చినా మొత్తాన్ని మాత్రం ఇవ్వలేదు’
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement