సాక్షి, కడప: సాంకేతిక విజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదో... అదే స్థాయిలో కొత్త కొత్త నేరాలు పెరుగుతున్నాయి. కూర్చున్నచోటు నుంచి అంగుళం కదలకుండా ఇంటర్నెట్ ద్వారా నేరాలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచంలోని ఏదో మూల నుంచి ఈ-మెయిల్‌ను హ్యాక్ చేయడం..మన ప్రమేయం ఏమీ లేకుండానే అసభ్యకర సందేశాలు పంపడం... మన బ్యాంకు ఖాతా నుంచి నగదు కొల్లగొట్టడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి నేరాలు ఇటీవల ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
సైబర్ నేరం అంటే ?:
ఇంటర్‌నెట్ ఆధారంగా కంప్యూటర్‌ను ఉపయోగించి చేసే ఏ నేరమైనా సైబర్ నేరమే! ఇతర వ్యక్తుల ఈ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌లు తెలుసుకుని వాటి ద్వారా చేసే నేరాన్ని ‘అకౌంట్ హ్యాకింగ్’ అంటారు. సదరు ఖాతాదారు పొందే అన్ని సేవలను హ్యాకర్లు పొందే అవకాశం ఉంది. వీటిని దుర్వినియోగం చేసి ఆర్థిక నేరాలకు పాల్పడతారు. మెయిల్స్ పంపటం, నెట్‌బ్యాంకింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, పెళ్లి సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, ఉద్యోగసంబంధ వ్యవహారాల వంటివి ఖాతాదారు ప్రమేయం లేకుండానే హ్యాకర్లు వినియోగించుకునే వీలుంది. ఇవే కాదు సిమ్‌క్లోనింగ్, క్రెడిట్ కార్డు క్లోనింగ్ తదితర నేరాలు బంగ్లాదేశ్ కేంద్రంగా జరుగుతున్నాయి. ఈ తరహా నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2006 అమలులోకి తెచ్చింది.
ప్రభుత్వశాఖలు సైతం హ్యాకింగ్ వలలో:
నెట్‌వర్కింగ్ రెండురకాలు. ఇంటర్‌నెట్ అందరికీ తెలిసిందే! రెండోది ఇంట్రానెట్...ఇంట్రానెట్‌ను వివిధ ప్రభుత్వశాఖలు తమ అంతర్గత వ్యవహారాల కోసం వినియోగిస్తుంటాయి. వీటి పాస్‌వర్డ్‌లను అత్యంత రహస్యంగా ఉంచుతారు. ఈ వ్యవస్థలో ఒక్క పాస్‌వర్డ్ నేరగాళ్లకు తెలిసినా దాని ఆధారంగా సంబంధిత సంస్థ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే అన్ని కార్యకలాపాలను తెలుసుకునే వీలుంది. హ్యాకర్లు పలు ప్రభుత్వశాఖలకు చెందిన ఖాతాలను సైతం హ్యాక్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. తమ నేరపూరిత చర్యల ద్వారా దేశ అంతర్గత భద్రతకు సైతం హ్యాకర్లు సవాలు విసురుతున్నారు. హ్యాకర్లు, హ్యాకింగ్‌ను ప్రోత్సహించేందుకు సైతం పలు వెబ్‌సైట్లు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండటం నివ్వెరపోయే సత్యం.
జిల్లాలో నివారణకు ప్రత్యేక చర్యలు: సైబర్ నేరాలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. మన రాష్ట్రంలో సీఐడీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో సైబర్ క్రైం స్టేషన్ ఉంది. యాంటీ సైబర్ క్రైం సాఫ్ట్‌వేర్లను ఉపయోగించే నిపుణులు ఉన్నారు. వీరు కేసులను పరిశోధిస్తారు. హ్యాకర్ల బారిన పడి పోగొట్టుకున్న విలువైన సమాచారాన్ని రికవరీ టూల్స్‌ను ఉపయోగించి తిరిగి రాబడతారు.
ఇప్పటి వరకూ ఎక్కడా సైబర్ నేరం జరిగినా ఆ కేసును హైదరాబాద్‌కు సిఫార్పు చేసేవారు. బాధితులకు అలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలోనే ‘సైబర్‌నేరాలు’ పరిశోధించేందుకు ఎస్పీ అశోక్‌కుమార్ చర్యలు తీసుకుంటున్నారు. ముగ్గురు సీఐలకు సైబర్ పరిశోధనపై శిక్షణ ఇప్పిస్తున్నారు. జిల్లా నుంచి సీసీఎస్ సీఐ ఆర్. పురుషోత్తంరాజు ఇప్పటికే శిక్షణకు వెళ్లారు. రిమ్స్ సీఐ నాయకుల నారాయణతో పాటు మరో సీఐని శిక్షణకు ఎంపిక చేశారు. వీరు ఈ నెల 15 నుంచి శిక్షణకు వెళ్లనున్నారు.
రికవరీ టూల్స్ కీలకం: ఎస్పీ
సైబర్‌నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఈ నేరాల పరిశోధనలో రికవరీ టూల్స్ కీలకం. దీన్ని ఆపరేట్ చేసే అధికారులు ఉంటే పరిశోధన సులువుగా ఉంటుంది. దీనిపైనే ప్రత్యేక శిక్షణ కోసం ముగ్గురు సీఐలు హైదరాబాద్‌లో శిక్షణకు వెళ్లారు. రికవరీ టూల్స్ సాఫ్ట్‌వేర్ ఏ స్టేషన్‌లో ఉంచి అయినా ఆపరేట్ చేయవచ్చు.
సైబర్ నేరాలకు చెక్
Published Fri, Dec 6 2013 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement
Advertisement