
వైట్‌కాలర్ నేరాల నియంత్రణకు చర్యలు
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో ఇటీవల కాలంలో పెరిగిపోతున్న వైట్‌కాలర్ నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ సూచించారు. నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని ఉమేష్ చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఆయన నేరసమీక్ష నిర్వహించారు. నిత్యం జిల్లాలో ఏదో ఒక చోట ఆర్థిక నేరాలు జరుగుతున్నాయన్నారు. చీటీల పేరుతో ప్రజలు మోసపోతున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతను మోసగిస్తూ కోట్ల రూపాయలు దండుకుని ఉడాయిస్తున్నారన్నారు. వీటన్నింటిని పూర్తిస్థాయిలో కట్టడి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అటువంటి నేరాలకు పాల్పడే వ్యక్తులతో కఠినంగా వ్యవహరించాలన్నారు. జాతీయ రహదారులపై తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా, అక్రమ రవాణా జరుగుతున్నా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దన్నారు. వాహనాల తనిఖీ సమయంలో అలసత్వం ప్రదర్శిస్తే ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సిబ్బందిలో కొందరు అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, పద్ధతి మార్చుకోని పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తగా ఎస్సైలుగా బాధ్యతలు చేపట్టిన వారికి చట్టాలతో పాటు వివిధ అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. కేసులు, బెయిల్‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాలపై త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నెల్లూరులో ట్రాఫిక్‌ను చక్కదిద్దేందుకు త్వరలో పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు. అనంతరం హైవే తనిఖీలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి మైదానంలో అవగాహన కల్పించారు. సమావేశంలో ఏఎస్పీ రెడ్డిగంగాధర్‌రావు, డీఎస్పీలు బి.వి రామారావు, చౌడేశ్వరి, వీఎస్ రాంబాబు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.