సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో తెల్ల కిరోసిన్ రాకెట్ హల్‌చల్ చేస్తోంది. అధునాతన పరిజ్ఞానంతో రేషన్‌ద్వారా సరఫరా చేయాల్సిన నీలికిరోసిన్‌ను తెల్ల కిరోసిన్‌గా మార్చేసి పెట్రోలు బంకులకు విక్రయిస్తున్నారు. వారు దానిని పెట్రోలు, డీజిల్‌లో కలిపేసి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ఈ విషయాలన్నీ విజిలెన్స్ తనిఖీలో వెల్లడయ్యాయి. రామభద్రపురం మండలం ఆరికతోట వద్ద కొందరు చేస్తున్న ఈ అక్రమ వ్యాపారం గుట్టు రట్టయినప్పటికీ... ఇంకా జిల్లాలో పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, గజపతినగరం, భోగాపురం, పూసపాటిరేగ, విజయనగరం తదితర ప్రాంతాల్లో తెల్ల కిరోసిన్ మిక్సింగ్‌తో పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనితోనే అక్రమార్కులు ప్రతీ నెలా రూ. కోట్లలో ఆర్జిస్తున్నట్టు సమాచారం.
ఆరికతోటలో విజిలెన్స్ దాడులు : విజిలెన్స్ ఎస్పీ వై.ప్రేమ్‌బాబు ఆధ్వర్యంలో రామభద్రపురం మండలం ఆరి కతోటలోని పాత సుగర్ ప్యాక్టరీ ఆవరణలో దాడులునిర్వహించి 29 వేల లీటర్ల నీలి కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.దానిని తెల్లకిరోసిన్‌గా మార్చడానికి వినియోగించే ‘హైలీ యాక్టివేటెడ్ బ్లీచింగ్ ఎర్త్స్, కార్బన్ 25 కేజీల చొప్పున ఉండే 48 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని మద్దిలపాలేనికి చెందిన వ్యాపారులు ఆర్.రవికుమార్, రామారావు, రామకృష్ణ ఈ రాకెట్‌కు సూత్రధారులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
పేదలకందాల్సిన నీలికిరోసిన్ ఇలా... : రేషన్‌కార్డులద్వారా సరఫరా చేసేందుకు ప్రతీ నెలా 10లక్షల లీటర్ల కిరోసిన్ జిల్లాకు వస్తోంది. చాలామంది ఈ కిరోసిన్ వినియోగించడం లేదు. అదంతా పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా జిల్లాకు సరఫరా అవుతున్న 60శాతానికి పైగా కిరోసిన్ అక్రమంగా తరలిపోతోంది. దీనిని ఇలా బంకులకు తరలిస్తున్నారని ఆరికతోట ఘటన రుజువు చేసింది.
హెచ్‌పీలోగోతో ఏమార్చి... :
కొందరు ప్రైవేటు బంకుల యజమానులు విశాఖకు చెందిన అక్రమార్కుల సాయంతో తెల్లకిరోసిన్ రాకెట్‌కు సూత్రధారులుగా మారుతున్నట్టు తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి హెచ్‌పీ కంపెనీ లోగోతో ఉన్న లారీ ట్యాంకుల ద్వారా నీలికిరోసిన్‌ను తరలిస్తున్నప్పటి కీ హెచ్‌పీ కంపెనీ లోగో వల్ల అక్రమ బాగోతాన్ని ఎవరూ సిగట్టలేకపోతున్నారు.మిక్సింగ్ ఇలా : నీలి కిరోసిన్‌ను ఎవరికీ అనుమానం రాకుండా తొలుత తెల్ల కిరోసిన్‌గా మారుస్తారు.
హైలీ యాక్టివేటెడ్ బ్లీచింగ్ ఎర్త్స్, కార్బన్ పౌడరుతో పాటు సోడియం హైడ్రో సల్ఫేట్ ద్రావణాన్ని దానిలో కలుపుతారు. దీనివల్ల కిరోసిన్ తెలుపురంగులోకి మారిపోతుంది.దీనిని పెట్రోలు, డీజిల్‌లో కలిపివిక్రయిస్తున్నారు. భారీగా అక్రమార్జన : లీటర్ పెట్రోలు రూ. 68. అందులో అర లీటర్ మాత్రమే ఒరిజనల్ పెట్రోలు ఉండగా, మిగతా అర లీటర్ తెల్ల కిరోసినే. దీని విలువ రూ. 15కి మించదు. ఈ లెక్కన అర లీటర్ పెట్రోల్ రూ. 34, అరలీటర్ తెల్ల కిరోసిన్ విలువ రూ. 15 కలిపితే రూ. 49 అవుతుంది. అంటే ఒక్కో లీటర్‌కు రూ. 19చొప్పున మిగలనుంది. ఇలా బంకుల యజమానులు ఎంతమేర ఆర్జిస్తున్నారో తెలుస్తోంది.
కిరోసిన్ రాకెట్ గుట్టు రట్టు !
Published Wed, Feb 10 2016 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM
Advertisement
Advertisement