
కాసులిస్తేనే కూడు పెట్టేది!
- కాలేజీ హాస్టల్ సిబ్బంది నిర్వాకం
- ఆకలితో అల్లాడుతున్న విద్యార్థినులు
- పట్టించుకోని అధికారులు
నూజివీడు, న్యూస్‌లైన్ : పేదవర్గాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్య చదువుకునేందుకు ప్రభుత్వం కాలేజీ హాస్టళ్లను ఏర్పాటు చేసింది. సాంఘికసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కాలేజీ హాస్టళ్ల నిర్వహణను ఆ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో వార్డెన్లు ఆడిందేఆట, పాడిందేపాటగా తయారైంది. ఒకవైపు ఏప్రిల్ నెలకు కూడా ప్రభుత్వం హాస్టల్ నిర్వహణకు నిధులు చెల్లిస్తుండగా, నూజివీడులోని బాలికల కాలేజీ హాస్టల్‌లో మాత్రం విద్యార్థినుల వద్ద ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఏప్రిల్‌నెలకు ఒక్కొక్క విద్యార్థిని రూ.1380 చెల్లిస్తేనే భోజనం పెడతామని, లేకపోతే పెట్టమని విద్యార్థినులపై హాస్టల్‌లోని వర్కర్లు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో డబ్బులు చెల్లించలేని వారు ఇళ్లకు వెళ్లిపోయి స్థానికంగా ఉన్న కళాశాలలకు డైలీసర్వీసు చేస్తుండగా, మరికొంతమంది చేసేది లేక చెల్లిస్తున్నారు. ఇంటర్ నుంచి పీజీకోర్సులతోపాటు ఇంజినీరింగు చదివే ఎస్సీ విద్యార్థినులు ఈ హాస్టల్‌లో ఉండి చదువుకోవచ్చు. వీరికి ఒక్కొక్కరికీ నెలకు రూ.1050 ప్రభుత్వం చెల్లిస్తోంది. అంటే ఒక్కొక్క విద్యార్థినికి రోజుకు రూ.35 ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ డబ్బులతో విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం టిఫిన్‌తో పాటు రెండుపూటలా భోజనం పెట్టాల్సి ఉంది.
వార్డెన్ ఎవరో తెలియదు...
కాలేజీ హాస్టల్‌కు వార్డెన్‌గా నిర్మలను 10 నెలల క్రితం నియమించారు. అయినప్పటికీ ఈమె హాస్టల్ నిర్వహణను పట్టించుకోకుండా వేరే హాస్టల్ వార్డెన్‌కు నిర్వహణను అనధికారికంగా అప్పగించేసిందనే ఆరోపణలున్నాయి. దీంతో ఆ వార్డెన్ ఇష్టారాజ్యంగా నిర్వహిస్తూ విద్యార్థినుల కడుపుకొడుతోందని చెబుతున్నారు. అసలు వార్డెన్ ఎవరో తమకు ఇంతవరకు తెలియదని, గిరిజ అనే ఆవిడే వార్డెన్ అని అనుకుంటున్నామని విద్యార్థులు పేర్కొనడం గమనార్హం.
డబ్బులు వసూలు చేయకూడదు
కాలేజీ హాస్టల్ నిర్వహణ నిమిత్తం ఏప్రిల్ నెలకూ ప్రభుత్వం నిధులు చెల్లిస్తున్నందున విద్యార్థినుల నుంచి డబ్బులు వసూలు చేయకూడదు. అలా చేస్తే ఖచ్ఛితంగా చర్యలు తీసుకుంటాం.
- డీ మధుసూదనరావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ