పార్వతీపురం(విజయనగరం): విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు కుడికాల్వకు శనివారం మధ్యాహ్నం భారీ గండిపడింది. దీంతో రూ.3 కోట్లలో చేపట్టిన అక్విడెక్ట్ పనులు మట్టి పాలయ్యాయి. సీతానగరం మండలం లక్ష్మీపురం వద్ద సువర్ణముఖీ అక్విడెక్ట్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండటంతో ఆయనతో ప్రారంభించాలనే తొందరలో ట్రయల్స్ చేపట్టారు.
పనులు పూర్తి చేయకుండానే శనివారం మధ్యాహ్నం నీరు వదలటంతో 15వ కిలోమీటర్ వద్ద కుడికాల్వకు పెద్ద గండిపడింది. దీంతో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న అక్విడెక్ట్ నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. దిగువన పొలాల్లో మట్టి మేటవేసింది. నారు మళ్లు నీటి ముంపునకు గురయ్యాయి. ఇదంతా అధికారుల అత్యుత్సాహం వల్లే జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు.