అధికార కాంగ్రెస్‌తో కలిసిపోవాలనుకుంటే తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి 14 నెలలుగా జైల్లో ఉండాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు శనివారం చేసిన విమర్శలపై ఆయన స్పందించారు.
గడిచిన నాలుగేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంతో అంటకాగుతున్న టీడీపీ నేతలు దిగజారుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే కాపాడింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మిగతా ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసం పెట్టినప్పుడు బాబు మద్దతిస్తే నేడీ ప్రభుత్వమే ఉండేది కాదని, రాష్ట్రానికి ఈ విపత్కర పరిస్థితులు ఎదురయ్యేవే కావని చెప్పారు.
ఎఫ్‌డీఐ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌కు టీడీపీ ఎంపీలను గైర్హాజరు చేయించి దాన్ని ఆమోదింపజేసిన ఘనత కూడా బాబుదేనని గుర్తుచేశారు. టీడీపీ ఇంత బహిరంగంగా కాంగ్రెస్‌తో కలిసి మెలిసి పనిచేస్తూ పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూ... ఆ బురద జగన్‌పై చల్లడం యనమలకే చెల్లిందన్నారు. అవిశ్వాస తీర్మానం దగ్గరనుంచి రాష్ట్ర విభజన అంశం వరకూ చంద్రబాబు తరచూ కాంగ్రెస్ అధినేతలతో సంప్రదింపులు జరుపుతూ సంబంధాలు కలిగి ఉన్నారని ఇటీవల ‘హిందుస్థాన్ టైమ్స్’ దినపత్రికలో వచ్చిన కథనాన్ని అంబటి ఉదహరిస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరి మధ్య ఉన్నదీ ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు.