ప్రజలకు వివిధ అవసరాల కోసం రకరకాల కార్డులు జారీ చేయడంపై గవర్నర్ నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వివిధ అవసరాల కోసం రకరకాల కార్డులు జారీ చేయడంపై గవర్నర్ నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాన్‌కార్డు, సిటిజన్ కార్డు, ఆధార్.. ఇలా రకరకాల కార్డుల స్థానంలో డీఎన్‌ఏ ఆధారిత కార్డులు జారీ చేస్తే మేలని సూచించారు. శనివారం సెంట్రల్ యూనివర్సిటీలోని సీఆర్ రావు ఇన్‌స్టిట్యూట్‌లో డీఎన్‌ఏ 2013 సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
డీఎన్‌ఏ టెక్నాలజీలో వస్తున్న మార్పులపై ప్రజలతోపాటు పోలీసులు, వైద్యులకు అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన ఈ సదస్సులో ఆయన మాట్లాడారు. నేరం జరిగినప్పుడు దోషులకు తగిన శిక్ష పడాలని, న్యాయం సకాలంలో అందాలని ప్రజలు ఆశిస్తారన్నారు. పరిమితుల పేరుతో జరిగే జాప్యాన్ని సహించే పరిస్థితి లేదని గవర్నర్ స్పష్టం చేశారు. దర్యాప్తులో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలను వాడకంలోకి తేవాలని సూచించారు. కార్యక్రమంలో డీజీపీ ప్రసాదరావు, ఫోరెన్సిక్ సెన్సైస్ లేబొరేటరీ డెరైక్టర్ శారద అవధానం, సీఆర్ రావు ఏఐఎంఎస్‌సీఎస్ అధ్యక్షుడు డాక్టర్ వి.కె.సారస్వత్ తదితరులు పాల్గొన్నారు.