=దంపతుల పరిస్థితి విషమం
=దిక్కుతోచని చిన్నారి
మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: కుటుంబ సమస్యలపై దంపతులు గొడవపడ్డారు. ఆగ్రహించిన భర్త కట్టెతో భార్య తలపై మోదాడు. ఆమె చనిపోయిం దని భావించి తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సోమవారం మదనపల్లె రూరల్ మండలంలో విషాదం మిగిల్చింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. పుంగనూరు మండలం ఈడిగపల్లె పంచాయతీ బోడువారిపల్లెకు చెందిన రమణ, గౌరమ్మ దంపతుల కుమారుడు రాజేంద్ర(32) కర్ణాటక రాష్ట్రం ముల్‌బాగల్ తాలూకా కొత్త మంగళానికి చెందిన వెంకటేష్, మంగమ్మ కుమార్తె ఆశ(28)ను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. రాజేంద్ర ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ మదనపల్లె- పుంగనూరు రోడ్డులోని బసినికొండలో కాపురం పెట్టాడు. వీరికి పెళ్లైన ఆరేళ్ల తర్వాత పాప పుట్టింది. ప్రస్తుతం ఆ పాపకు ఏడాదిన్నర వయస్సు ఉంది.
ఇదిలా ఉండగా నెలరోజుల క్రితం పాపకు తీవ్ర జ్వరం రావడంతో ఆశ భర్తకు ఫోన్‌చేసి వెంటనే ఆస్పత్రికి రావాలని చెప్పింది. భర్త చాలా ఆలస్యంగా వెళ్లాడు. ఇద్దరూ ఇంటికెళ్లిన తర్వాత పాపకు జబ్బు చేస్తే ఆస్పత్రికి వచ్చేంత సమయమూ లేదా..?అని భార్య ప్రశ్నించింది. దీంతో ఇద్దరూ తగువులాడుకున్నారు. అంతే భర్తపై అలిగిన ఆశ కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత రాజేంద్ర భార్యను కాపురానికి తీసుకొచ్చేందుకు అత్త ఇంటికి రెండుసార్లు వెళ్లాడు. అత్తామామలు, బావమర్దులు ఆశను కాపురానికి పంపకపోగా రాజేంద్రను అవమానపరిచి కొట్టారు. దీంతో అతను ఇంటికొచ్చేశాడు.
రెండు రోజుల క్రితం ఆశను మేనమామ వెంటబెట్టుకుని రాజేంద్ర ఇంటికి వచ్చాడు. దంపతులిద్దరికీ నచ్చజెప్పి వెళ్లిపోయాడు. ఇంతలో ఏమైందో ఏమో ఆదివారం రాత్రి దంపతులిద్దరూ తిరిగి గొడవ పడ్డారు. తెల్లవారి నిద్రలేవగానే మళ్లీ గొడవపడ్డారు. క్షణికావేశానికి లోనైన రాజేంద్ర ఇంట్లో ఉన్న కట్టెతో భార్య తలపై మోదాడు. ఆమె మెదడు బయటకొచ్చి తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయింది. చనిపోయిందేమోనని భావిం చిన రాజేంద్ర కత్తితో తన గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
ఆపై తన కుమార్తెను తీసుకుని రక్తస్రావం అవుతుండగానే ఆటోలో మదనపల్లె ఆస్పత్రికి చేరుకున్నాడు. తన భార్యను హత్యచేసి, తాను ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పాడు. ఆ వెంటనే ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజేంద్ర కుమార్తెను ఆస్పత్రి సిబ్బంది చేరదీశారు. రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆశ ప్రాణాలతోనే ఉండడంతో ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్యం చేయించారు. పరీక్షించిన వైద్యులు బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నరకయాతన అనుభవించిన ఆశ
భార్యాభర్తలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు రాజేంద్ర తల్లిదండ్రులు, అక్క రమణమ్మలకు తెలిసింది. వారు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆశ పరిస్థితి విషమంగా ఉందని, పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పినప్పటికీ తమకేమీ పట్టనట్లు వెళ్లిపోయారు. రక్తస్రావం ఆగకపోవడంతో ఆశ నరకయాతన అనుభవించింది. ఆఖరకు మధ్యాహ్నం 2 గంటలకు ఆశ కుటుంబసభ్యులు వచ్చి తమ బిడ్డను కోలారు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
బిడ్డ పరిస్థితి దయనీయం
రాజేంద్ర, ఆశ దంపతుల కుమార్తె ప్రతిభ పరిస్థితి దయనీయం గా మారింది. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ముక్కుపచ్చలారని ఆ చిన్నారికి ఏమి జరిగిందో తెలియక ఆస్పత్రి సిబ్బంది వద్దే ఉండిపోయింది. ఏడ్చినప్పుడు వాళ్లు పాలబుడ్డి ఇవ్వడంతో పాలు తాగుతూ ఏడుపు ఆపేసేది. దీన్ని చూసిన సిబ్బంది, స్థానికులు అయ్యో పాపం అంటూ కన్నీటి పర్యంతమవడం కనిపించింది.
భార్యపై దాడి..ఆపై ఆత్మహత్యాయత్నం
Published Tue, Nov 19 2013 2:49 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement