చిన్నప్పటినుంచీ అనుకుంటున్నా... మేనమామతో ఇష్టంలేని పెళ్లి... ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రియుడిని వదిలి ఉండలేని పరిస్థితి... ఆమెను హత్యవైపు ఉసిగొల్పాయి. పెద్దలకు ప్రేమ విషయం చెప్పలేక అప్పటికి తాళి కట్టించుకున్నా... ఎలాగైనా వదిలించుకోవాలన్నదే ఆమె ఆలోచన. అందుకు ప్రేమికుడి తోడు అర్థించింది. ఆయన ద్వారా ఓ కిరాయి హంతకుడితో బేరం కుదుర్చుకుంది. పథకం ప్రకారం వారిని రప్పించి... తాము వెళ్తున్న ప్రాంతాన్ని గూగుల్‌మ్యాప్ ద్వారా పంపించి.. ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించి ఎంచక్కా కట్టుకున్నోడిని హత్యచేయించి... అదో దోపిడీగా చిత్రీకరించేందుకు యత్నించి... విఫలమైంది.
విజయనగరం టౌన్: గరుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ పార్కు సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న హత్యోదంతం ఎంతగా సంచలనం కలిగిం చిందో... కొన్ని గంటల వ్యవధిలోనే ఆ సంఘటనకు సూత్రధారి హతుడి భార్యే అని తేలడంతో ఇప్పుడు అవాక్కవ్వడం జిల్లా ప్రజల వంతయిం ది. పథకం ప్రకారం కట్టుకున్నోడిని కడతేర్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకోసం ఫేస్‌బుక్‌ద్వారా పరిచయం అయిన ప్రియుడు... విశాఖకు చెందిన కిరాయి హంతకుడిని వినియోగించుకున్నట్టు స్పష్టమైంది. దీనికి సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు పరారీలో ఉన్నాడు. జిల్లా ఎస్పీ జి.పాలరాజు జిల్లా కాన్పెరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు.
అసలేం జరిగింది...?
గరుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ పార్కు సమీపంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టపుడివలసకు చెందిన యామక గౌరీశంకరరావు, పదిరోజుల క్రితం పెళ్లి చేసుకున్న అదే మండలం కడకెళ్లకు చెందిన సరస్వతితో కలసి బైక్‌పై వస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి వారిపై దాడి చేశారు. ఈ సంఘటనలో తనభర్తను హతమార్చి, తన మెడలోని బంగారాన్ని అపహరించుకుపోయారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కర్ణాటక రాష్ట్రంలో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడనీ, గత నెల 28న తమ వివాహం జరిగిందనీ, ఇద్దరం కలసి పార్వతీపురం వచ్చి, హోండా మోటార్ సైకిల్‌ను దాడి హోండా షోరూమ్‌లో సర్వీసింగ్‌కి ఇచ్చి అక్కడి బంధువుల ఇంటికి వెళ్లామనీ, మధ్యాహ్నం భోజనం తర్వాత షోరూమ్‌నుంచి బైక్ తీసుకుని వీరఘట్టం వెళ్తుండగా మార్గమధ్యలో లఘుశంక తీర్చుకునేందుకు దిగగా ఈ సంఘటన జరిగిందనీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు గరుగుబిల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
రంగంలోకి దిగిన ఎస్పీ
విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జి.పాలరాజు వెంటనే రంగంలోకి దిగి సిబ్బందిని అప్రమత్తం చేశారు. సంఘటనా స్ధలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అన్ని స్టేషన్‌ల పరిధిలో వాహనాల తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. పెదమానాపురం తనిఖీ కేంద్రం వద్ద ముగ్గురు వ్యక్తులు రాత్రి 11.30 గంటల సమయంలో రావడంతో అనుమానంతో వారిని ప్రశ్నించారు. వాళ్లు ప్రయాణిస్తున్న ఆటో విశాఖ రిజిస్ట్రేషన్ కలిగి ఉండటంతో పాటు, వారు ముగ్గురూ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం మరింత పెరిగింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారిది విశాఖపట్నానికి చెందిన మెరు గు గోపి, సారిపల్లి రామకృష్ణ, గుర్రాల బంగార్రాజుగా తెలిపారు. వారితో వచ్చిన ఆటోడ్రైవర్ పేరు దేవరాపల్లి కిశోర్‌గా తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెదమానాపురం పోలీసులు వారిని మరింత లోతుగా ప్రశ్నించడంతో గౌరీశంకర్‌పై దాడికి పాల్పడి, అతడిని హతమార్చింది తామేనని అంగీకరించారు.
పథకం ప్రకారమే హత్య
సరస్వతికి ఇష్టం లేకుండా మేనమామ గౌరీశంకర్‌తో వివాహం జరిగింది. ఆమె విశాఖకు చెందిన మడ్డు శివ అలియాస్ ఆది అనే వ్యక్తిని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుని ప్రేమలో ఉంది. ఇష్టం లేని వివాహాన్ని రద్దుచేసుకోవాలంటే భర్త ను హతమార్చడమే సరైన నిర్ణయమని శివతో పథకం రూపొందించింది. విశాఖపట్నానికి చెంది న మెరుగు గోపిని కలిసి, తన భర్తను హత్యచేసేం దుకు సాయంచేయాలనీ, అందుకు ప్రతిగా బంగా రం ఇస్తానని తెలిపింది. ముందుగా మొబైల్‌లో టీఈజెడ్ యాప్ ద్వారా రూ.8వేలు బదిలీ చేసిం ది. బంగారు ఉంగరాన్ని అందించింది. తర్వాత శివ రూ.10వేలు అడ్వాన్సుగా అందించారు. ఒప్పందం కుదిరిన తర్వాత గోపీ తన స్నేహితులు విశాఖకు చెందిన పాతనేరస్తుడు, సారిపల్లి రామకృష్ణ, గుర్రాల బంగార్రాజులకు విషయం తెలిపి, హత్యచేసేందుకు సాయపడాల్సిందిగా కోరారు. హత్యకు పథకాన్ని రూపొందించిన గోపి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సరస్వతికి తెలిపి, పథకాన్ని ఆమెకు వివరించాడు. దంపతులు పార్వతీపురం వచ్చినరోజు నిందితులు ముగ్గురూ ఆటోలో విశాఖ నుంచి పార్వతీపురానికి వచ్చి, తిరిగి బైక్‌పై వెళ్తున్నవారిని ఫాలో అవుతూ, ఆమెతో చాటింగ్ చేస్తూ వచ్చారు. ఐటీడీఏ పార్కు వద్ద కాపు కాసి ఉండగా, పథకం ప్రకారం సరస్వతి లఘుశంక తీర్చుకునేందుకు బైక్ ఆపమని చెప్పింది. భర్త గౌరీశంకర్ బైక్ ఆపడమే తరువాయి ఒక్కసారిగా అతనిపై దాడి చేసి ఇనుపరాడ్డుతో తలపై కొట్టగా గౌరీశంకర్ అక్కడకక్కడే ప్రాణాలు వదిలాడు.
మూడు గంటల్లోనే కేసు ఛేదన
రాత్రి 8 గంటలకు హత్య జరిగిన తర్వాత జిల్లా ఎస్పీ అటుగా వెళ్లే అన్ని చోట్లా వాహన తనిఖీలు ముమ్మరం చేయించారు. సరస్వతితో మాట్లాడినప్పుడు పొంతనలేని సమాధానం ఇవ్వడం, పెదమానాపురం వద్ద అనుమానాస్పదంగా ఆటోలో ముగ్గురు కనిపించడంతో కేవలం మూడు గంటల్లోనే కేసును పరిష్కరించగలిగారు.
రెండేళ్లుగా శివతో ప్రేమాయణం
2016లోనే మడ్డుశివతో సరస్వతికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయింది. వారి స్నేహం ప్రేమవరకూ దారితీసింది. అయితే తనకు ఇష్టం లేకున్నా మేనమామ గౌరీశంకరరావుతో తల్లిదండ్రులు పెళ్లిచేయడంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇష్టం లేని భర్తతో శారీరకంగా కలిసేందుకూ సమ్మతించలేదు. ఎలాగైనా భర్తను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే బంగారు ఆభరణాల కోసమే హత్య జరిగినట్లు పోలీసులను నమ్మించేందుకు యత్నించింది. ఆభరణాలు తనవద్దే ఉంచుకుని... తన గాజులను పగలగొట్టుకుని తనపైనా దాడిజరిగిందంటూ నమ్మబలికింది. విచారణలో నేరం నిరూపణ కావడంతో నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ఆటో, బంగారు ఆభరణాలు, ఇనుపరాడ్డు స్వాధీనపరుచుకున్నామని ఎస్పీ వివరించారు.
రోదనలతో మార్మోగిన ఏరియా ఆస్పత్రి
పార్వతీపురం: తోటపల్లి ఐటీడీఏ పార్కువద్ద సోమవారం రాత్రి నవదంపతులపై దాడి చేసి అందులో వరుడిని హతమార్చిన సంఘటన ఇటు విజయనగరం, అటు శ్రీకాకుళం జిల్లాలోనూ సంచలనం సృష్టించింది. ఇంతలోనే ఆ హత్యను కట్టుకున్న భార్యే చేయించిందని తేలడంతో అంతా అవాక్కయ్యారు. ఈ సంఘటనతో గౌరీ శంకర్రావు కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి నెట్టేసింది. ఇంత ఘోరం జరుగుతుం దని ఊహించలేదని తల్లి, దండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కుమారుడు అమాయకుడని, చాలా మంచివాడని అటువంటివాడిని ఇలా చంపేస్తారని ఊహించలేదని రోదించారు. తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, బంధువుల రోదనతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రి ప్రాంతం విషాదం అలముకుంది. నమ్మిన కోడలే పుత్ర శోకాన్ని మిగిలుస్తుందని ఊహించలేదని, ఇష్టం లేకపోతే విడిచి వెళ్లిపోయినా బాగుండేదని ఆ తండ్రి గుండెలవిసేలా విలపించాడు. కాగా ఆ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు ఆస్పత్రివద్దే మంగళవారం పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment