చిత్తూరు అర్బన్: తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు భార్య అంగీకరించింది. తవణంపల్లెలో జరిగిన మొగిలిరెడ్డి (45) హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతని భార్య మమత(38), ప్రియుడు వీరభద్రారెడ్డి (45)ని అరెస్టు చేశారు. డీఎస్పీ సుబ్బారావు శనివారం చిత్తూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గంగాధరనెల్లూరు మండలం వరత్తూరుకు చెందిన మొగిలిరెడ్డికి తవణంపల్లె మండలం మిట్టూరుకు చెందిన మమతతో 20 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరు మిట్టూరులోనే నివసిస్తున్నారు. వీరికి డిగ్రీ కుమార్తె, కొడుకు ఉన్నారు. కొంతకాలంగా మమతకు మిట్టూరుకు చెందిన వీరభద్రారెడ్డి అలియాస్ మిట్టూరబ్బతో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానించాడు.
ఈ విషయమై పలుమార్లు గొడవ కూడా జరిగింది. భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన మమత ప్రియుడు వీరభద్రారెడ్డితో కలిసి పథకం పన్నింది. ఈ క్రమంలో గురువారం రాత్రి పొలంలో ఉన్న ఆవు ఈనుతుందని మొగిలిరెడ్డి అక్కడికెళ్లి పడుకున్నాడు. అర్ధరాత్రి ప్రాంతంలో వీరభద్రారెడ్డి వెదురుకొయ్యతో మొగిలిరెడ్డి తల, శరీరంపై బలంగా కొట్టాడు. అతను చనిపోకపోవడంతో గొంతు నులిమాడు. మొగిలిరెడ్డి కాళ్లను మమత గట్టిగా పట్టుకుంది. తెల్లారేసరికి గుర్తుతెలియని వ్యక్తులు తన భర్తను చంపేశారంటూ గ్రామస్తులను నమ్మించింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వారికి జడ్జి 14 రోజుల రిమాండు విధించారు.
పోలీసు జాగిలం మ్యాగీకి సన్మానం
ఈ కేసును ఛేదించడంలో ప్రధాన పాత్ర పోషించిన పోలీసు జాగిలం మ్యాగీని అధికారులు ఘనంగా సన్మానించి గోల్డ్ మెడల్ బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment