సుత్తితో మోది భర్తను చంపిన భార్య | wife kills husband in chittoor | Sakshi
Sakshi News home page

సుత్తితో మోది భర్తను చంపిన భార్య

Published Mon, Sep 11 2017 10:42 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

సుత్తితో మోది భర్తను చంపిన భార్య - Sakshi

సుత్తితో మోది భర్తను చంపిన భార్య

- పచ్చటి సంసారంలో చిచ్చు రేపిన అనుమానం

చిత్తూరు:
వాళ్లిద్దరిదీ చిన్ననాటి ప్రేమ. ఈడొచ్చాక పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. 20 ఏళ్లుగా సజావుగా సాగుతోన్న వారి సంసారంలో అనుమానపు బీజం చిచ్చురేపింది. వేరొకరితో సంబంధం ఉందంటూ భార్యను విపరీతంగా వేధించడం మొదలుపెట్టాడు భర్త. ఆ వేధింపులు పరాకాష్టకు చేరుకోవడంతో సహనం కోల్పోయిన ఇల్లాలు సుత్తితో మోది భార్తను హత్యచేసింది. సోమవారం చిత్తూరులో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

చిత్తూరు టౌన్‌ అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన కె.శ్రీనివాసులు (45) సొంతంగా లారీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఎనిమిదో తరగతి చదువుకునే సమయం నుంచి శ్రీనివాసులు, లక్ష్మి ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో 20 ఏళ్ల క్రితం వీరి పెళ్లయింది.
 
అయితే కొంతకాలంగా తన భార్య.. లారీ క్లీనర్‌తో సంబంధం నడుపుతోందని శ్రీనివాసులు అనుమానించాడు. ఈ విషయమై క్లీనర్‌ను  హెచ్చరించాడు. ఇటు భార్య లక్ష్మితోనూ గొడవపడ్డాడు. ఈ క్రమంలో శ్రీనివాసులు ఆదివారం రాత్రి భార్యతో మరోసారి గొడవకు దిగాడు. ‘నీకు ఎవరితో సంబంధం ఉందో చెప్పు.. లేకుంటే చంపేస్తా’ అని హెచ్చరించాడు. తనకు ఏ పాపం తెలియదని, ఎవరితోనూ అలాంటి సంబంధాలు లేవని లక్ష్మి గట్టిగా చెప్పింది. దీనిపై ఇద్దరూ వాదులాడుకున్నారు.

కాసేపటికి మద్యం సేవించి వచ్చి.. ‘తెల్లారేసరికి ఎవరితో సంబంధం ఉందో చెప్పకుంటే చంపేస్తా’నంటూ భార్యను హెచ్చరించాడు. శ్రీనివాసులు మంచంపై పడుకుని ఉండగా రాత్రి 2 గంటల ప్రాంతంలో లక్ష్మి అతడిని కిందకు తోసి సుత్తితో తలపై బలంగా మోదింది. గాయపడ్డ శ్రీనివాసులు లక్ష్మి చేతిని కొరకడంతో సుత్తితో మరో నాలుగు దెబ్బలు వేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఆమె నేరుగా టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement