భార్యని చంపిన ప్రభుత్వ ఉద్యోగి
చిత్తూరు (అర్బన్): ఆర్మీలో దేశరక్షణ కోసం తనవంతు సేవలందిస్తున్నాడు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. చిత్తూరు నగరంలో మూడు రోజల క్రితం హత్యకు గురైన ద్రాక్షాయణి (32) కేసులో ఆమె భర్త మురళి (33)ని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ వెంకటప్ప శనివారం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. చిత్తూరు నగరం అశోకపురానికి చెందిన మురళి ఆర్మీలో పనిచేస్తున్నాడు. తవణంపల్లె మండలం కారకాంపల్లెకు చెందిన ద్రాక్షాయణి ఇతడ్ని ప్రేమించి రెండో పెళ్లి చేసుకుంది.
వీరికి కుమారుడు శ్రీనివాసులు(14), కుమార్తె భార్గవి(11) ఉన్నారు. ఈ క్రమంలో ద్రాక్షాయణికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన మురళి పలుమార్లు ఆమెతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో గత నెల 28న అర్ధరాత్రి భార్య మెడకు బెల్టుతో బిగించి చంపేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతదేహానికి ఓ చీర చుట్టి ఫ్యాన్‌కు వేలాడదీశాడు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ ప్రసాద్ దర్యాప్తు చేయగా మురళినే తన భార్యను చంపినట్లు గుర్తించారు. దీంతో నిందితుడిని అరెస్టు చేశారు. అతనికి జడ్జి రిమాండు విధించారు. అతన్ని చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు.