మిస్డ్‌ కాల్‌తో మిస్సెస్సై.. | Wife Silence Protest Infront Of Husband House Prakasam | Sakshi
Sakshi News home page

మిస్డ్‌ కాల్‌తో మిస్సెస్సై..

Published Fri, Aug 24 2018 11:46 AM | Last Updated on Fri, Aug 24 2018 11:46 AM

Wife Silence Protest Infront Of Husband House Prakasam - Sakshi

భర్తతో కలిసి తీయించుకున్న ఫొటో, భర్త ఇంటి ఎదుట మౌనదీక్ష చేస్తున్న యువతి

ప్రకాశం, గిద్దలూరు: మిస్డ్‌ కాల్‌తో మిసెస్‌ను చేసుకుని రెండు నెలల కాపురం చేసి ఆ తర్వాత ఆమెను పుట్టింట్లో వదిలేసి పారిపోయి వచ్చిన ఓబులాపురానికి చెందిన మహేశ్వరరెడ్డి ఉదంతమిది. భర్త ఇంకా వస్తాడని ఎదురు చూసిన భార్య ఎంతకీ రాకపోగా ఫోన్‌ పని చేయకపోవడంతో గురువారం నేరుగా ఓబులాపురం వచ్చిన యువతి మహేశ్వరరెడ్డి ఇంటి ఎదుట మౌనదీక్షకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాలతి మండలంలోని ఓబులాపురానికి చెందిన వేమిరెడ్డి మహేశ్వరరెడ్డికి మిస్డ్‌ కాల్‌ ద్వారా ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని నమ్మబలికి మాలతి కుటుంబ సభ్యులను నమ్మించి గుడిలో మహేశ్వరరెడ్డి వివాహం చేసుకున్నాడు.

అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అనంతరం హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ అక్కడే కాపురం పెడదామని ఉప్పల్‌లోని గణేష్‌నగర్‌ తీసుకెళ్లి అక్కడ ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. రెండు నెలల కాపురం చేసిన తర్వాత భార్యను శ్రీకాకుళం తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. అప్పటికే ఆమె గర్భం దాల్చింది. రెండు నెలలుగా ఆమెతో మాట్లాడటం లేదు. ఫోన్‌ చేయడం లేదు. ఆమె ఫోన్‌ చేస్తే కట్‌ చేస్తున్నాడు. ఇక తన బంధువులకు ముఖం ఎలా చూపించగలనని బాధితురాలు విలపిస్తోంది. తాను వచ్చినట్లు సమాచారం తెలుసుకున్న మహేశ్వరరెడ్డి తన బంధువుల ద్వారా బెదిరిస్తున్నాడని, అతని తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారని బాధితురాలు చెబుతోంది. చావైనా బతుకైనా తన భర్త మహేశ్వరరెడ్డితోనేనని, ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెబుతోంది. భర్త ఆచూకీ తెలిపి న్యాయం చేయాలని మాలతి కోరుతోంది. మహేశ్వరరెడ్డి గతంలోనూ గ్రామానికి చెందిన ఓ వివాహితను ఇంటి నుంచి తీసుకెళ్తుండగా గమనించిన ఆమె కుటుంబ సభ్యులు పట్టుకుని చితకబాదినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement