పిఠాపురం : దశాబ్దాల తరబడి కష్టసుఖాలను కలిసి పంచుకున్న భర్తపైనే.. ఆస్తి రాయడం లేదన్న కసితో నడిరోడ్డుపైనే కత్తి దూసిందో మహిళ. ఆమె ఘాతుకానికి గాయపడ్డ ఆ వృద్ధుడు ఆస్పత్రిలో కోలుకుంటుండగా ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం వెల్దుర్తిలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. వెల్దుర్తి ఎస్సీ పేటకు చెందిన 60 ఏళ్ల దేవారపు లాజర్, 55 ఏళ్ల నూకాలమ్మ దంపతులకు కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉన్నారు. లాజర్ పేరిట కొంత పొలం, ఇల్లు ఉండగా రూ.వెయ్యి పింఛను అందుకుంటున్నాడు. ఆస్తి బిడ్డలకు ఇచ్చేస్తే, తన బాగోగులు చూసే వారుండరంటున్న నూకాలమ్మ కొంతకాలంగా ఆస్తిని తన పేరిట రాయమని భర్తతో గొడవపడుతోంది.
భార్యాభర్తల మధ్య రాజీకి మంగళవారం పెద్దలు పంచాయితీ నిర్వహిస్తుండగా నూకాలమ్మ మధ్యలోనే వెళ్లిపోయింది. బుధవారం లాజర్ మరో వ్యక్తితో కలిసి టీ తాగేందుకు ఊరి సెంటర్‌లోకి వెళ్లాడు. భర్తను వెన్నాడుతూ వచ్చిన నూకాలమ్మ వెనుక నుంచి మెడ మీద నరికేందుకు కత్తి దూసింది. పసిగట్టిన లాజర్ కుడిచెయ్యి అడ్డం పెట్టుకుని తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని తొలుత పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రూరల్ ఎస్సై మురళీమోహన్ నిందితురాలిని గురువారం కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.