బడ్జెట్‌పై చర్చలో నిలదీస్తా.. : వైఎస్ జగన్ | will ask about governor speech at AP budget discussion,says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌పై చర్చలో నిలదీస్తా.. : వైఎస్ జగన్

Published Thu, Mar 12 2015 1:56 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

బడ్జెట్‌పై చర్చలో నిలదీస్తా.. : వైఎస్ జగన్ - Sakshi

బడ్జెట్‌పై చర్చలో నిలదీస్తా.. : వైఎస్ జగన్

* ప్రభుత్వానికి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ హెచ్చరిక
* గవర్నర్ ప్రసంగం లేదా బడ్జెట్...
* ఏదో ఒకదాని మీదే విపక్ష నేత మాట్లాడటం సంప్రదాయం
* 2013 బడ్జెట్ సమావేశాలకు అప్పటి విపక్ష నేత చంద్రబాబు హాజరు కాలేదు
* గవర్నర్ ప్రసంగం మీద విపక్ష నేత మాట్లాడకపోవడం ఫస్ట్ టైమ్ అన్న సీఎం

 
 సాక్షి, హైదరాబాద్: ‘గవర్నర్ ప్రసంగం లేదా బడ్జెట్... ఏదో ఒకదాని మీదే విపక్ష నేత మాట్లాడటం సంప్రదాయం. గవర్నర్ ప్రసంగం మీద నేను మాట్లాడటం లేదు. బడ్జెట్ మీద జరిగే చర్చలో మాట్లాడతా. ప్రభుత్వాన్ని కడిగేస్తా. కాస్త ఒపికపట్టండి..’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార పక్షానికి సూచించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద విపక్ష నేత జగన్ మాట్లాడకపోవడాన్ని బుధవారం టీడీపీ సభ్యులు తప్పుబట్టారు. ‘ధన్యవాద తీర్మానం మీద విపక్ష నేత మాట్లాడకపోవడం ఇదే తొలిసారి. నాయకత్వ దివాలాకోరుతనం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. సీఎం విమర్శకు సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వాలని జగన్ స్పీకర్‌ను కోరారు. చంద్రబాబు ప్రసంగం ముగిసిన తర్వాత మాట్లాడమని స్పీకర్ సూచించారు. తమ నేతకు అవకాశం ఇవ్వాలని విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి డిమాండ్ చేసిన తర్వాత.. జగన్‌కు స్పీకర్ అవకాశం ఇచ్చారు. 2013 బడ్జెట్ సమావేశాలకు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక్కరోజూ హాజరు కాలేదు... ఆ విషయం గుర్తులేదా? అని జగన్ ప్రశ్నించారు.
 
  ఏపీ తొలి బడ్జెట్ సమావేశంలో తాను మాట్లాడితే.. తాను మిగతా సభ్యులకు అవకాశం ఇవ్వడం లేదని టీడీపీ విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. బడ్జెట్ మీద తాను పూర్తిస్థాయిలో మాట్లాడతానని, ప్రభుత్వాన్ని అప్పుడు ఉతికేస్తానని చెప్పారు. ‘మిమ్మల్ని ఎలా కడిగేస్తానో ఆరోజు చూపిస్తా..’ అని అన్నారు. నిబంధనలు తెలియని విపక్ష నేత సభలో ఉన్నారంటూ టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన విమర్శలకు జగన్ ఘాటుగా స్పందించారు. ‘నిబంధనలు, సభా సంప్రదాయాలు తెలియకపోతే తెలుసుకోవాలి. చదువు మీరు (అధికారపక్ష సభ్యులు) నేర్చుకోవాలి. నేర్చుకోని వచ్చిన తర్వాత మాట్లాడండి. ప్రతిపక్ష నేత ఎన్నిసార్లు మాట్లాడతారు. ధన్యవాద తీర్మానం లేదా బడ్జెట్... ఏదో ఒకదాని మీదే మాట్లాడతారు. నిబంధనలు తెలుసుకోవాల్సింది నేను కాదు.. చంద్రబాబు, ఆయన పార్టీ సభ్యులు’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
 నవ్వడం.. మానసిక రోగమట!
 చంద్రబాబు కొత్త భాష్యం
 ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి, విపక్ష సభ్యులు సభలో నవ్వడంపై ముఖ్యమంత్రి అసహనానికి గురయ్యారు. నవ్వడం మానసిక రోగమంటూ కొత్త అర్థం చెప్పారు. ధన్యవాద తీర్మానం మీద జరిగిన చర్చకు బుధవారం సభలో తాను సమాధానం ఇస్తున్నప్పుడు.. విపక్ష సభ్యులు నవ్వుతూ కనిపించడంతో చంద్రబాబు అసహనానికి గురై స్పందించారు. ‘మనకు విచిత్రమైన ప్రతిపక్షం ఉంది. 35 సంవత్సరాలుగా నేను సభలో ఉన్నాను. ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదు. జలగం వెంగళరావు, చెన్నారెడ్డి, జనార్దన్‌రెడ్డి, విజయభాస్కరరెడ్డి, ఎన్టీఆర్.. తదితర ముఖ్యమంత్రుల వద్ద పనిచేస్తున్నప్పుడు గర్వంగా ఉండేది.
 
 నాలాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులకే సభలో మాట్లాడాలంటే ఇంత ఇబ్బంది (సఫకేషన్)గా ఉంటే.. మిగతా వారి సంగతేమిటి?’ అని ప్రశ్నించారు. ‘నేను చెప్పేది అర్థంకాక నవ్వుతున్నారా? ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావడం లేదు. వెకిలి చేష్టలు చేస్తున్నారు. నవ్వడం ఒక మానసిక రోగం. మీకు మానసిక రోగం ఉంది. దానికి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తా’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం ఎప్పుడో ఒకసారి కామెంట్ చేస్తే ఫర్వాలేదని, కానీ నిరంతరం నవ్వుతుంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఎలాంటి వాళ్లు ఉన్నా సమాధానం చెబుతానని, అది తన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతిపక్షం నవ్వుతుంటే స్పందించవద్దని, స్పీకర్‌కే వదిలిపెడదామంటూ అధికార పక్ష సభ్యులకు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement