గృహ నిర్మాణ రంగంపై మంత్రి కిమిడి మృణాళిని ఇచ్చిన జవాబుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం గందరగోళం చోటుచేసుకుంది.
హైదరాబాద్ : గృహ నిర్మాణ రంగంపై మంత్రి కిమిడి మృణాళిని ఇచ్చిన జవాబుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం గందరగోళం చోటుచేసుకుంది. జియో ట్యాగింగ్ విధానంపై మంత్రి జవాబును తాను సరిగ్గా వినలేకపోయాననని, దానిపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. తాను మంత్రిగారిని కేవలం క్లారిఫికేషన్ మాత్రమే కోరానని, ప్రశ్నించటం లేదని ఆయన అన్నారు. గృహ నిర్మాణ రంగంలో అవకతవకలు జరిగాయా లేదా అనే విషయాన్ని స్పష్టంగా తెలిపాలన్నారు.
ఈ క్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు జోక్యం చేసుకుని వైఎస్ జగన్పై ఆరోపణలు చేశారు. అయితే మంత్రి సమాధానం స్పష్టంగా లేదని ప్రతిపక్షం మరోసారి ప్రశ్నించింది. దీనిపై స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా మంత్రి సూటిగా సమాధానం చెప్తే బాగుంటుందని సూచించారు. అంతకు ముందు మంత్రి రావెల కిషోర్ బాబు వ్యాఖ్యలను ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు.
కాగా గతంలో నిర్మించిన ఇళ్లు వాస్తవంగా నిర్మించారా.. లేదా అసలైన లబ్ధిదారులే ఉన్నారా? తదితర వివరాలు సేకరించేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.