![ఎక్కడ సీటిస్తే అక్కడ పోటీ: పురందేశ్వరి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71394317799_625x300.jpg.webp?itok=9NRqYVCu)
ఎక్కడ సీటిస్తే అక్కడ పోటీ: పురందేశ్వరి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచి పోటీ చేయాలన్న అభిప్రాయంతో ఉన్నట్టు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. అయితే బీజేపీ తనకు ఎక్కడి నుంచి టిక్కెట్ ఇస్తే అక్కడి నుంచే పోటీచేస్తానని తెలిపారు. కాంగ్రెస్‌లో ఎంపీ సుబ్బరామిరెడ్డి లాంటి వారినుంచి అవమానాలు ఎదురైనా పార్టీ పెద్దలు పట్టించుకోలేదని మండిపడ్డారు. విభజన పేరిట కాంగ్రెస్, కేంద్రం సీమాంధ్రకు అన్యాయం చేసినందునే తాను ఆ పార్టీని వీడానన్నారు.
ఆమె శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో భర్త, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలసి మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు. కానీ సీమాంధ్ర అభివృద్ధికి సంబంధించి మేము ప్రతిపాదించిన ఏ అంశాన్నీ కేంద్రం పట్టించుకోలేదు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను అనుసరించే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా. నాపై కేంద్ర మంత్రి జైరాం రమేష్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. రామాయపట్నంలో నేను భూములు కొన్నట్లు చెబుతున్న జైరాం రమేష్ ఆ సర్వే నంబర్లు చెబితే వెళ్లి ఎక్కడున్నాయో చూసుకుంటా. హరికృష్ణ ఏ పార్టీలో ఉన్నా ఆయన ఆశీర్వాదం నాకు ఉంటుంద’’ని పురందేశ్వరి అన్నారు.