
కొత్త సీఎస్ కృష్ణారావు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ఎంపికకు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సోమవారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫైలు పంపించారు. 1979, 1980 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల ఏడుగురు పేర్లతో కూడిన ఫైలును సీఎస్ ముఖ్యమంత్రికి పంపించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎస్ ఎంపిక ఫైలును చూడటానికి విముఖత వ్యక్తం చేసిన పక్షంలో ప్రస్తుతం సీసీఎల్‌గా పనిచేస్తున్న ఐవైఆర్ కృష్ణారావుకు సీఎస్ బాధ్యతలు అప్పగిస్తూ మహంతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
ప్రస్తుత సీఎస్ మహంతి ఈ నెల 28వ తేదీతో పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. సీనియారిటీ ప్రకారం 1979 ఐఏఎస్ బ్యాచ్, 1980 ఐఏఎస్ బ్యాచ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల పేర్లను జాబితాలో సీఎస్ పేర్కొన్నారు. సీఎస్ జాబితాలో పేర్కొన్న వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1979 ఐఏఎస్ బ్యాచ్‌లో ఐ.వి.సుబ్బారావు (ప్రస్తుతం యునెస్కోలో పనిచేస్తున్నారు), సీసీఎల్‌గా పనిచేస్తున్న ఐవైఆర్ కృష్ణారావు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చందనాఖన్, సాధారణ పరిపాలన (ఆర్‌ఐఏడీ)లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జె. ఆర్. ఆనంద్, అలాగే 1980 బ్యాచ్‌కు చెందిన కేంద్ర సర్వీసులో ఉన్న సత్యనారాయణ మహంతి, రోడ్లు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న డి. లక్ష్మీపార్థసారథి, అశ్వనీకుమార్ పరీడాలతో కూడిన జాబితాను సీఎంకు పంపించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఈ నెల 28వ తేదీతో పదవీ విరమణ అనంతరం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) గౌరవ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం మహంతి ముందుగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేత ఫైలు ఆమోదం పొందారు. 28వ తేదీ పదవీ విరమణకు ముందుగా సీసీజీ గౌరవ అధ్యక్షునిగా తనను నియమించుకుంటూ సీఎస్ హోదాలో మహంతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు, రాష్ట్ర విభజన ప్రక్రియ అంతా సీజీజీలోనే జరగనుంది. రాష్ట్ర విభజన సమాచారాన్ని కేంద్రానికి చేరవేయడం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడంలో మహంతితో పాటు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న రామకృష్ణారావు కీలక భూమిక పోషించారు. రాష్ట్ర విభజన తరువాత పంపిణీలోనూ ఇరువురు కీలక భూమిక నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.