అంతుచిక్కని అంతరంగం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అంచనాలకు అందని, విమర్శకులకు చిక్కని అపర మేధావి మనసులోని మాట ఎవరికీ అంతుబట్టడంలేదు. ఆయన అంతరంగం తెలుసుకోవాలనుకున్న వారికి ఆశాభంగమే ఎదురవుతోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ స్థానానికి పోటీ చేసే అంశంపై ఆయన నోరు మెదపడంలేదు. దీంతో చేవెళ్ల లోక్‌సభ సీటుపై కన్నేసిన ఆశావహులు డోలాయమానంలో పడ్డారు. రాజకీయాల్లో ఆచితూచి స్పందించే కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి వ్యూహాత్మకంగా మౌనముద్ర దాల్చడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2009లో తొలిసారి చేవెళ్ల బరిలో దిగిన జైపాల్... తదుపరి ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయననే విషయాన్ని బహిరంగంగా ప్రకటించనప్పటికీ, సన్నిహితులతో ఈ అంశంపై స్పష్టతనిచ్చినట్లు ప్రచారం జరిగింది.
దీంతో ఈ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న నేతల ంతా కదనరంగంలో కాలుమోపేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తెరవెనుక పావులు కదుపుతున్నారు. జైపాల్‌రెడ్డి మాత్రం ఇప్పటివరకు అభ్యర్థిత్వంపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వీరిని ఆత్మరక్షణలో పడేసింది. పెద్దాయన రేసులో ఉంటే.. ఆయనను కాదని సీటు దక్కించుకోవడం కల్ల అని నేతాగణం భావిస్తోంది. ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతున్న తరుణంలో జైపాల్ నుంచి స్పష్టత రాకపోవడం వీరిని కలవరపరుస్తోంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయంలో నియోజకవ ర్గం వైపు జైపాల్ కన్నెత్తి చూడలేదు.
దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసే ఆలోచనను విరమించుకున్నట్లేనని అంతా భావించారు. రాష్ర్ట విభజన ప్రకటన వచ్చిందే తడవు.. జైపాల్‌రెడ్డి తనదైన శైలిలో లౌక్యం, రాజకీయ మంత్రాంగం నెరపి మరోసారి తెరమీదకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పెద్దన్న పాత్రను పోషించారని, ఆయనే కొత్త రాష్ట్రానికి తొలి సీఎం అనే ప్రచారం నేపథ్యంలో లోక్‌సభకు పోటీచేయకపోవచ్చనే వాదనకు బలం చేకూరింది. ముఖ్యమంత్రి రేసులో ఉన్నందున సొంత నియోజకవర్గం కల్వకుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేయవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో చేవెళ్ల సీటుపై కన్నేసిన ఆశావహులు లోక్‌సభ బరి నుంచి జైపాల్ తప్పుకొన్నట్లేనని భావించి వ్యూహాలకు పదునుపెట్టారు. రాజకీయాలను ఔపోసన పట్టడమే కాదు..అద్భుతమైన ప్రతిభ, వాగ్ధాటితో ఎంతటి వారినైనా మెప్పించి ఒప్పించేజైపాల్ ఎంపీ స్థానానికి పోటీ చేసే అంశాన్ని గుంభనంగా ఉంచుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమౌతోంది.