పొలిటికల్‌ హీట్‌ | Lok sabha Political Fight Between TRS And Congress In Chevella | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ హీట్‌

Published Mon, Mar 4 2019 11:41 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Lok sabha Political Fight Between TRS And Congress In Chevella - Sakshi

కేటీఆర్‌ పాల్గొనే సభా స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి మల్లారెడ్డి,  మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు దూసుకెళ్తున్నాయి. చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు ఆయా పార్టీలు కదనరంగంలోకి దూకుతున్నాయి. అభ్యర్థులు ఎవరనేది దాదాపుగా ఖరారవడంతో పార్లమెంట్‌ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల నిర్వహణకు శ్రీకారం చుడుతున్నాయి. అధికార పార్టీ షెడ్యూల్‌ ఇప్పటికే ఖరారైంది. కాంగ్రెస్‌ పార్టీ త్వరలో ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

రంగారెడ్డి: చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం 2009లో ఏర్పాటైంది. ఇక్కడి నుంచి తొలిసారి కాంగ్రెస్‌ అభ్యర్థి జైపాల్‌రెడ్డి విజయం సాధించగా.. గత ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. అనంతరం అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన హస్తం గూటికి చేరారు. ఇలా ఒక్కోసారి విజయాన్ని అందుకున్న ఈ రెండు పార్టీలు.. వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీజేపీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అయితే ఈ పార్టీ.. సన్నాహక సమావేశాల నిర్వహణపై ఇంకా దృష్టి సారించనట్లు తెలుస్తోంది. అధికారికంగా అభ్యర్థి పేరు ప్రకటించాకే సమావేశాల అంశాన్ని పరిశీలిస్తామని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

9న చేవెళ్లలో టీఆర్‌ఎస్‌ సభ  చేవెళ్ల కేంద్రంగా సన్నాహక సమావేశాన్ని ఈనెల 9న టీఆర్‌ఎస్‌ భారీ ఎత్తున నిర్వహించనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు స్థానిక ఫరా కళాశాలలో ప్రారంభమయ్యే సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు హాజరు అవుతుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఏ విషయంలోనూ లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఆయా నియోజకవర్గాల నుంచి 15 వేల నుంచి 20 వేల మంది పార్టీ శ్రేణులను తరలించాలని నిర్ణయించారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి 2 వేల నుంచి 3 వేల మంది పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

పార్టీ శ్రేణుల సమీకరణ బాధ్యతలను సంబంధింత సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు అప్పగించారు. మొత్తం సన్నాహక సమావేశ బాధ్యతలను కార్మికశాఖ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి చూస్తున్నారు. ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇన్‌చార్జిలను ఒక వైపు సమన్వయం చేస్తూనే.. మరోవైపు సమావేశ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆదివారం మంత్రి మల్లారెడ్డి, పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి గట్టు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించి వారికి నేతలకు దిశానిర్దేశం చేశారు.

కేటీఆర్‌ దిశానిర్దేశం..

చేవెళ్ల లోక్‌సభ పరిధిలోకి వచ్చే చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల నుంచి పార్టీ ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ముఖ్య కార్యకర్తలకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించే వీలుంది. మరోపక్క ప్రత్యర్థుల కదలికపై కన్నేయడంతోపాటు వారి ఎత్తులను చిత్తు చేసేందుకు సంసిద్ధులను చేయనున్నారు. ప్రస్తుత ఎంపీలు పార్లమెంట్‌లో సాధించిన విజయాలు, తాజా గెలుపుతో ఒనగూరే ప్ర యోజనాలను శ్రేణులకు వివరించే వీలుంది. అ లాగే పార్టీలో చేరికలపైనా దృష్టి సారించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇతర నియోజకవర్గాల్లోనూ.. 

భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశం ఏడో తేదీన భువనగిరిలో నిర్వహించనున్నారు. ఈ లోక్‌సభ పరిధిలోకి వెళ్లే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి కూడా భారీగా పార్టీ శ్రేణులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ సన్నాహక సమావేశం 17న పాలమూరులో జరగనుండగా.. ఈ స్థానంలో అంతర్భాగంగా ఉన్న షాద్‌నగర్‌ నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలను తీసుకెళ్లనున్నారు. ఈమేరకు జన సమీకరణ బాధ్యతలను ఆయా సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌కు అప్పగించారు.

మరింత క్షేత్రస్థాయిలోకి కాంగ్రెస్‌

 టీఆర్‌ఎస్‌తో పోల్చుకుంటే సమావేశాలను మరింత క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. లోక్‌సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నాయకులను ఒకే చోటుకు చేర్చి టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్‌ మాత్రం అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను తలపెట్టేందుకు మొగ్గు చూపుతోంది. వీలైనంత త్వరలో సమావేశాలను ఏర్పాటు చేస్తామని పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. నాలుగైదు రోజుల్లో ఈమేరకు షెడ్యూల్‌ వెల్లడయ్యే అవకాశ ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన సర్పంచ్‌లు అధిక సంఖ్యలో గెలుపొందారు. ఇదే స్ఫూర్తితో పార్లమెంట్‌ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement