మూడు గంటల్లోనే...! | with in three hours...! | Sakshi
Sakshi News home page

మూడు గంటల్లోనే...!

Published Wed, Feb 5 2014 3:53 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

with in three hours...!

అంతా ఎవరి పనుల్లో వారున్నారు. ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్ధం. తేరుకునేలోపే మంటలు వ్యాపించి రూ. కోట్ల నష్టాన్ని ట్రాన్స్‌కోకు మిగిల్చాయి. మంటలను ఆర్పే ప్రయత్నం సకాలంలో చేయడంతో పాటు రక్షిత చర్యలు తీసుకున్నందున పక్కనే ఉన్న మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను కాపాడుకో గలిగారు. ఇదీ జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్న విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో సంభవించిన అగ్ని ప్రమాద ఘటన తీరు.
 
 ధరూరు, న్యూస్‌లైన్ : సాంకేతిక లోపమో, విద్యుత్ స రఫరాలో అధిక వేడిమో సమస్య ఏదైనా విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఉన్న 100 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ఒక్కసారి గా పేలి మంటల్లో కాలిపోవడంతో, మూడు గంటల్లో రూ.3 కోట్ల విలువ చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ను ట్రాన్స్‌కో కోల్పోవాల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి... గ ద్వాల, నారాయణపేట డివిజన్లలో ఉన్న లోఓల్టేజీ స మస్యను నివారించాలన్న ఉద్దేశంతో రూ.18 కోట్లతో ట్రాన్స్‌కో జూరాల ప్రాజెక్టు వద్ద 220/132 కేవీ సబ్‌స్టేషన్‌ను 2011లో ప్రారంభించింది.
 
 మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు సబ్‌స్టేషన్‌లో ఒకేసారి భారీగా శబ్దం వచ్చింది. ఏమైందోనని బయటకు వచ్చి సిబ్బంది,అక్కడ విధుల్లో ఉన్న ఇంజనీర్లు చూ సే లోపే భారీ ఎత్తున పొగలు కమ్ముకొని మంటలు చెలరేగాయి. అక్కడేం జరుగుతుందో కూడా తెలి యని పరిస్థితి ఏర్పడింది.
 
 తీరా మంటల్లో 100 ఎం వీఏ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడాన్ని గమనించిన ట్రా న్స్‌కో అధికారులు విషయాన్ని అగ్నిమాపక కేంద్రాల తోపాటు, ఆ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గద్వాల, ఆ త్మకూరు ప్రాంతాల అగ్నిమాపక కేంద్రాల వాహనా లు హుటా హుటిన జూరాలకు చేరుకున్నాయి. సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా భారీ ఎత్తున ఎగిసి పడుతుండడంతో అదుపులోకి రాలేదు. రెండు వాహనాల ద్వారా నీటిని పంపింగ్ చేస్తూ ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు మూడు గంటలు ఫైర్ సిబ్బంది శ్రమించి ఐదు గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. 100 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు దాని అనుబందంగా ఉన్న రేడియేటర్ పూర్తిగా కాలిపోయాయి. ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ఈ విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. లోపం ఎక్కడ తలెత్తింది, మంటలు ఎందుకు వ్యాపించాయి అనే దానిపై ఆరా తీశారు. భారీ ఎత్తున పొగలు కమ్ముకొని మంటలు చెలరేగిన విషయాన్ని గమనించిన చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తరలి వచ్చారు. పవర్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ 200 మీటర్ల వరకు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురైన ట్రాన్స్‌కో అధికారులు, పోలీసులు ప్రజలను అక్కడికి రానివ్వలేదు.
 
 ఇదిలా ఉండగా మంటల్లో కాలిపోయిన 100 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ పక్కనే కుడి పక్కన ఉన్న మరో ట్రాన్స్‌ఫార్మర్‌కు అగ్ని ప్రమాదం తప్పినట్లయింది. ఎక్కడ ఇలాంటి సబ్‌స్టేషన్లు నిర్మించినా ట్రాన్స్‌ఫార్మర్‌ల మధ్య సిమెంట్ కాంక్రీటుతో ఒక గోడను ఏర్పాటు చేస్తామని, అందులో భాగంగానే ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం వల్ల మరో రూ.3 కోట్ల విలువ చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ను కాపాడుకోగలిగామని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. అయితే అంతా ప్రాజెక్టుకూ నష్టం వాటిల్లి విద్యుత్తు ఉత్పత్తి కూడా ఆ ప్రభావం పడిందని తొలుత భావించారు. దాని కనెక్షన్ వేరే మార్గంలో ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు కలగలేదని అధికారులు తెలిపారు.
 
 కారణాలను అన్వేషిస్తున్నాం... డీఈ రాము.
 సబ్‌స్టేషన్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలను అన్వేషిస్తున్నాం. మంటలు ఎలా వ్యాపించి ఉంటాయి, అందుకు గల కారణాలు ఏంటి అనే దానిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. నిపుణుల బృందంచే విచారణ చేయించి కాలిపోవడానికి గల కారణాలను వెల్లడిస్తామని ట్రాన్స్‌కో డీఈ రాము తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement