
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల కట్టడి
డీజీపీ జేవీ రాముడు
నెల్లూరు(క్రైమ్) : అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పూర్తిస్థాయిలో నేరాలను కట్టడి చేస్తామని రాష్ట్ర డీజీపీ జాస్తి వెంకటరాముడు అన్నారు. ఆదివారం స్థానిక ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫెరెన్స్‌హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసుశాఖలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐక్లిక్, అభయం మొబైల్ యాప్, ట్రావల్ ట్రాకర్ తదితర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. వీటి ద్వారా ప్రజలు పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో 24గంటలు ఫిర్యాదు చేయచవ్చన్నారు.
ప్రత్యేకించి మహిళలు, విద్యార్థినులకు ఇవి ఎంతగానో దోహదపడుతాయన్నారు. వీటి ద్వారా ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌ను కట్టడిచేయవచ్చన్నారు. ఇప్పటికే జిల్లాలో మూడుప్రాంతాల్లో ఐక్లిక్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నేరాల నియంత్రణకు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఎందరో తమ ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. వీటిని నియంత్రించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మందుబాబులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు జిల్లా ప్రశాంతతకు మారుపేరని, జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించడంలో ముందంజలో ఉందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతోన్న స్మగ్లర్లు, కూలీలను అరెస్ట్‌చేసి జైలుకు పంపామన్నారు. గంజాయి అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామన్నారు.
మెరుగైన శాంతిభద్రతలు అందించండి..
జిల్లా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించాలని డీజీపీ జేవీ రాముడు పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఆయన పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు మెరుగుగా ఉన్నపుడే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తారన్నారు. ఈ విషయాన్ని గమనించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఐక్లిక్, అభయం యాప్‌లపై విసృ్తత అవగాహన కల్పించాలన్నారు. ప్రధాన కూడళ్లు, షాపింగ్‌మాల్స్, బహుళ అంతస్తుల భవనాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నేరాలను కట్టడిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, గుంటూర్ రేంజ్ ఐజీ ఎన్.సంజయ్, జిల్లా ఎస్పీ డాక్టర్ గజరావుభూపాల్, ఏఎస్పీలు రెడ్డిగంగాధర్, సూరిబాబు పాల్గొన్నారు.
రూ.11.50 కోట్లతో భూమిపూజ
నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాల సమీపంలో పాత ఏఆర్ క్వార్టర్స్ స్థలంలో రూ.11.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులకు డీజీపీ జేవీ రాముడు భూమి పూజ చేశారు. తొలుత వర్షం కారణంగా భూమి పూజ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పినప్పటికీ జోరువానలోనే భూమి పూజ చేశారు. తొలుత ఆయన తన సతీమణి జాస్తి అనంత సాయి పద్మజతో కలిసి మూలాపేట పోలీసుక్వార్టర్స్ సమీపంలో బొల్లినేని శీనయ్య అండ్ సన్స్ కంపెనీ సౌజన్యంతో నిర్మించిన పోలీసు కన్జ్యూమర్ స్టోర్స్ అదనపు గదుల ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులను స్టోర్స్‌లో ఉంచాలని సిబ్బందికి సూచిం చారు. ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం పోర్టు సీఈఓ అనిల్‌ఎండ్లూరి, ఏపీ పో లీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ప్రసాదరావు, డి. జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.