
నవంబర్‌లో ‘పోలీసు’ నోటిఫికేషన్!
5 కి.మీ. పరుగుకు స్వస్తి.. ప్రతిభ ఆధారంగా సెలక్షన్లు: డీజీపీ
చిత్తూరు అర్బన్/ తిరుపతి క్రైం/ సాక్షి,తిరుమల : పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నవంబర్ నెలాఖరులోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని డీజీపీ జేవీ.రాముడు తెలిపారు. శనివారం ఆయన చిత్తూరు, తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ పోలీసుశాఖలో 5 కి.మీ. పరుగును రద్దు చేసి, కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టే దిశగా చర్చలు జరుగుతున్నాయన్నారు. అభ్యర్థుల శారీరక సామర్థ్యంతో పనిలేకుండా వారి ప్రతిభ ఆధారంగా సెలక్షన్లు నిర్వహిస్తామన్నారు. హోంగార్డులకు జీతాలు పెంచుతామని, మెడికల్ అలవెన్స్ మొదలగు వాటి గురించి ప్రతిపాదనలు పెట్టామన్నారు.
నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్ కారణంగా మృతి చెందిన విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై ప్రిన్సిపల్ బాబూరావును ఎందుకు అరెస్టు చేయలేదని చిత్తూరులో విలేకరులు అడిగిన ప్రశ్నకు డీజీపీ సమాధానమిచ్చారు. ‘ఎవరో ఏదో మాట్లాడితే అరెస్టు చేయలేం. రిషితేశ్వరి మృతిలో ప్రిన్సిపల్ ప్రమేయం ఉందని ఎవరివద్దయినా ఆధారాలున్నాయా..? ’ అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఎంతటివారైనా నేరం రుజువైతే శిక్ష తప్పదన్నారు. కాగా శనివారం ఉదయం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.